No products in the cart.
జూలై 05 – ఒంటరితనము తొలగుచున్నది!
“నేను మోషేకు తోడై యుండినట్లు, నీకును తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను (యెహొషువ.1:5 )
ప్రభునివద్దనుండి మనకు అనుగ్రహింపబడిన ఔనత్యములయందు సంతోషింపదగినది ఆయనయొక్క ప్రసన్నతయే. ఆయన యొక్క ప్రసన్నతవలె మధురమైనది బలమైనది మరొకటిలేదు. ఆయన యొక్క మహిమగల ప్రసన్నతను మనకు ఇచ్చుటకే యేసుక్రీస్తు భూమిమీదకు దిగివచ్చెను. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను”(మత్తయి. 28:20) ఆ రీతిగా చెప్పి మనతో నిత్యము నివసించుచున్నాడు.
ఒక సహోదరుడు బ్రాహ్మణ కులము నుండి యేసుక్రీస్తును అంగీకరించినందున్న తమనెలవరులచే శ్రమలను అనుభవించెను. ఒక దినమున అతని తల్లిదండ్రులు ఆయనను చూచి “నిన్ను కనిపెంచిన మేము కావలెనా లేక, యేసుక్రీస్తు కావలెనా, చెప్పుము” అని చెప్పిరి. ఆయన నిదానముగా, “యేసు క్రీస్తే కావలెను” అని చెప్పేను. ‘నీకు ఆస్తిపాస్తులు ఇల్లు ఏమియు వద్దా’ అని అడిగిరి. అందుకు ‘యేసుక్రీస్తే చాలును’ అని చెప్పెను. వారు బహు మూర్ఖముగా కోపించి ఆయన వస్త్రములన్నిటిని చింపివేసి, కొట్టి “బయటకు పో” అని తరిమివేసిరి.
ఆ సహోదరుడు వీధినపడి ఒంటరిగా నడిచి వెళుచున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క మధురమైన స్వరము ఆయన చెవులకు గింగురుమని ధ్వనించెను. “కుమారుడా, నేను నిన్ను అనాధగా విడువను” అని ఆయన మాట్లాడెను. అప్పుడు ప్రభువుయొక్క మధురమైన ప్రసన్నత ఆ సహోదరుని ఆవరించెను.
ప్రభువు ఆనాడు గిద్యోను చూచి, “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడు” (న్యాయా. 6:12) అని చెప్పెను. దేవుని దూత మరియను చూచి, “దయాప్రాప్తురాలా, నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను”(లూకా .1:28). ప్రభువు మోషేను చూచి, “నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను”(నిర్గ.3:14) అని వాక్కునిచ్చెను. అదే ప్రభువు మారనివాడై, బలముగలవాడై ఎల్లప్పుడు మీతోకూడా ఉన్నాడు. అందుచేత నిబ్బరముకలిగి ఉండుడి. నిరుత్సాహమును దులిపివేసి ఉత్సాహముగా ఉండుడి. ప్రభువు మీ ద్వారా మహిమగల కార్యములను చేయును.
దావీదురాజు ప్రభువు తనతోకూడా ఉండుటను గ్రహించెను. ప్రభువును ఎల్లప్పుడును నా ఎదుట ఉంచుకుని ఉండుటచేత కదల్చబడను అని చెప్పి ధైర్యముగానుండెను. తనను విడచి ఎడబాయని ప్రభువు తన యొక్క కాపరిగా ఎల్లప్పుడు తనతో కూడా ఉన్నాడు అను గ్రహింపు ఆయనకు ఉండుటచేత, ఆయన సంతోషముతో, “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను; నీవు నాకు తోడై యుందువు; నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును”(కీర్తన. 23:4) అని చెప్పుకొనుచు బలమును పొందుకొనెను. ప్రభువు అంతము వరకు దావీదుతోకూడా ఉండి మార్గము నడిపించినట్లుగా మిమ్ములను నడిపించును.
నేటి ధ్యానమునకై: “వారు బయలుదేరి, వాక్య మంతట ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్”(మార్కు.16:20).