No products in the cart.
మార్చి 26 – ఎరిగియున్నాడు!
“మరియు యెహోవా: …. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు (నాకు తెలిసేయున్నవి) ఎరిగియున్నాను” (నిర్గమ. 3:7).
ప్రభువు మనలను ఎరిగియున్నాడు, మనము పడుచున్న వేదనలను, దుఃఖములను ఎరిగియున్నాడు. మీరు ఎట్టి స్థితియందు ఉన్నారో ఆయన ఆ సంగతిని అర్థము చేసుకొనియున్నాడు. నహూము ప్రవక్త చెప్పుచున్నాడు: “యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును” (నహూము. 1:7).
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వములో వేదన పడుచుండిరి. వారు నాలుగు వందల ముప్పై సంవత్సరములు అక్కడ బానిసలుగా ఉండవలసిన పరిస్థితి వచ్చెను. కనాను దేశమును వారు పొందుకొనవలెను అంటే వారు అన్ని సంవత్సరములు సహనముతో ఉండవలసినది ఆవస్యమైయుండెను.
వారు సహనముతో ఉంటేనే ఐగుప్తీయులు మరియు కనాను నందుగల జనులైయున్న అమ్మోనీయులు మొదలగు వారి యొక్క దోషములు పరిపూర్ణమగును. ప్రభువు అట్టి దేశమును ఇశ్రాయేలు జనులకు ఇచ్చుటకు హేతువైయుండును. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ సంగతిని తెలుసుకొనక ఐగుప్తులో పనులతో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వేదనపడి నిట్టూర్పుతో మొర పెట్టిరి. ఉపద్రవము చెంది తమ పితరుల యొక్క దేవుడు ఎక్కడ అని కన్నీరు కార్చిరి.
మన ప్రియ ప్రభువు వారి యొక్క దుఃఖములను, విచారములను, మూల్గులను, కన్నీటిని ఎదిగియుండెను. కావున మోషేను చూచి: ‘వారు పడుచున్న వేదనను ఎరిగియున్నాను’ అని ప్రేమతో చెప్పెను.
ప్రభువు మిమ్ములను ఎరిగియున్నాడు. మీరు మీ యొక్క ఉద్యోగ స్థలములలో పడుచున్న ఉపద్రవములను ఆయన ఎరుగును. లేక మీ గృహమునందుగల ఉపద్రవములను ఆయన గ్రహించుచున్నాడు. మీ యొక్క ఆహారముతో పాటు కన్నీటిని కలిపి మీరు భుజించుటను చూచుచున్నాడు. మీకు విరోధముగా తప్పుడు నిరారోపములు తీసుకొని వచ్చుటను ఆయన ఎరిగియున్నాడు.
ప్రభువు మిమ్ములను విడిపించేటువంటి సమయము వచ్చియున్నది. ఆనాడు ఇశ్రాయేలీయులను మోషే ద్వారా నడిపించిన ప్రభువు నేడు మిమ్ములను అద్భుతముగా నడిపించును. ఇక మీదట మీరు ప్రభువును వెంబడించి గొప్ప ఔన్నత్యమైన స్థలమునకు హెచ్చింపబడుదురు.
మీ యొక్క తల్లి, మీ యొక్క నిజమైన స్థితిని, అర్థము చేసుకొనక ఉండినప్పటికి కూడాను, ఈ లోకములో అందరు కూడాను మిమ్ములను పొరపాటుగా తలంచుచు ఉండినప్పటికిని, ప్రభువు మిమ్ములను ఎరిగియున్నాడు. అను సంగతిని నిశ్చయముగానే ఎరిగియుండుడి. ఆయన మీ పట్ల అక్కర గలవాడైయున్నాడు.
మిమ్ములను, మీ తల్లి యొక్క గర్భమునందు రూపించినవాడును, మీ కొరకు సిలువలో క్రయధనమును చెల్లించిన వాడునైయున్న ప్రభువు, నిశ్చయముగానే మిమ్ములను బానిసత్వములన్నిటిలో నుండి విమోచించి హెచ్చింప చేయును. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్ములను ఏరిగియున్నవాడు.
నేటి ధ్యానమునకై: “ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, (ప్రభువు) క్రీస్తు యొక్క నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది” (2. తిమోతి. 2:19).
