AppamAppam - Telugu

జూలై 09 – హిజ్కియాయొక్క యధార్ధత!

“యెహోవా, యథార్థహృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని ప్రార్థించెను”(2.రాజులు. 20:3)

నేటి ధ్యానమునందు హిజ్కియారాజు యొక్క యథార్థతను గూర్చి మనము ధ్యానించబోవుచున్నాము. హిజ్కియా యూదా దేశమును పరిపాలించిన పదమూడవ రాజు. తన యొక్క ఇరవై ఐదవ ఏట రాజు ఆయెను. ఈయన యూదా రాజ్యమునందు యధార్ధముగాను సత్యముతోను పరిపాలించిన ముగ్గురు రాజులలో ఒక్కరైయుండెను. హిజ్కియా పేరునకు “యెహోవాయె నా బలము” అనుట అర్థము!

హిజ్కియా యొక్క యధార్ధత ఏమిటి? ఆయన విగ్రహారాధనను నిర్మూలముచేసి, విగ్రహాములకు బలులు అర్పించు ఉన్నతస్థలములను కొట్టివేసెను. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మోషే తయారు చేసిన ఇత్తడి సర్పమును సేవించుచు వచ్చినందున దానిని పగులగొట్టేను. దైవ ఆరాధనను క్రమపరచి జనులను ఆత్మతోను సత్యముతోను ఆరాధించునట్లు మార్గమును సరాళము చేసెను.

అది మాత్రమే కాదు, చెదరిపోయిన సమస్త ఇశ్రాయేలీయులను ఏకముగా కూడుకొనునట్లు చేసి, పస్కా పండుగను పద్నాలుగు దినములు ప్రత్యేకముగా ఆచరింప చేసెను. హిజ్కియా ఎంతటి యధార్ధతగలవాడై యెహోవాను ప్రేమించెను అనుటను  రెండవ దినవృత్తాంతముల గ్రంథమునందు 30 ‘వ అధ్యాయమునందు చదువగలము.

బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “​హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను”(2.దినవృ. 31:20).  అయినను హిజ్కియాయొక్క జీవితమునందు ఒక పోరాటము వచ్చెను. భయంకరమైన వ్యాధి అతనికి వచ్చెను. ఆయన వ్యాధితో మరణమునకు చేరువ అవుతున్నప్పుడు, ఆయనను దర్శించుటకు వచ్చిన యెషయా ప్రవక్త, “నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము”(2. రాజులు.20: 1)  అని సెలవిచ్చెను.

ఆ మాటలను విన్న హిజ్కియా రాజుయొక్క మనస్సు బద్దలై, “యెహోవా, యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా”(యెషయా.  38:3).

హిజ్కియా రాజుయొక్క యధార్ధత ప్రభువుయొక్క హృదయమును తాకెను. హిజ్కియాయొక్క యదార్ధతీయు, సత్యముతో నడిచివచ్చిన ప్రతి మార్గమును ప్రభువు జ్ఞాపకము చేసుకొనేను, “నీవు కన్నీళ్లు విడుచుట  చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్షును నీకిచ్చెదను”(యెషయా.38:5-6) అని చెప్పి ఆయుషుదినములను పొడిగించెను.

దేవుని బిడ్డలారా, ప్రభువు యెదుట యథార్థముగాను, సత్యముతోను ఉంటున్నప్పుడు ప్రభువు మీయొక్క ప్రార్థనను ఆలకించును. మీయొక్క కన్నీటిని తుడిచును. మీయొక్క ఆయుషుదినములను అధికముచేయును. బైబులు గ్రంథము చెప్పుచున్నది, “ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు; భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి”(కీర్తన.98:3).

 

నేటి ధ్యానమునకై: “కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను”(కీర్తన.89:33).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.