AppamAppam - Telugu

జూలై 16 – దావీదుయొక్క నమ్మకత్వము!

“​యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను; నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున, ఆయన నా నీతిని నా విశ్వాస్యతను (నమ్మకత్వమును), చూచి నాకు ప్రతిఫలము దయ చేయును”(1.సమూ. 26:23)

అభిషేకింపబడిన వారిపై చేయ్యివేయకుము అని ప్రభువు చెప్పిన మాటను అలాగే నెరవేర్చుటకు దావీదు నమ్మకస్తుడైయుండెను. సౌలు రాజుగా అభిషేకింపబడినవాడు. అయితే ప్రభువు యొక్క మాటకు లోబడనందున ప్రభువుచే తృణీకరింపబడెను. ప్రభువు సౌలుయొక్క సింహాసనమును తీసి దావీదునకు ఇచ్చుటకు సంకల్పించెను. అయినను దావీదునకు సౌలుపై ఒక గౌరవమును, మర్యాదయు ఉండెను.

అయితే సౌలు, దావీదును వేటాడుచు తరుముచు వెళ్ళెను. దావీదు కొండలలోను గుహలలోను, దాగుకొనినను సౌలు తన సైనికులతో దావీదును వెదకి పట్టుకొనునట్లు ప్రయత్నించుచూ ఉండెను. అయితే ఒక దినమున సౌలు నిద్రించుచున్నప్పుడు, దావీదు ఎవరికి తెలియకుండా సౌలు చెంతకు వచ్చెను. నిద్రించుచున్న సౌలు వద్ద నున్న యీటెను, నీళ్ల బుడ్డిని తీసుకొనిపోయెను. అయితే సౌలును చంపలేదు. సౌలును చంపుటకు తలంచిన అభీషైను చూచి దావీదు, “యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి, నిర్దోషియగుట యెవనికి సాధ్యము?”(1.సమూ.26:9) అని చెప్పెను.

ప్రభువు దావీదు యొక్క నమ్మకత్వమును చూచెను. దావీదును ఆశీర్వదించుటకు సంకల్పించెను. దావీదు రానురాను వర్ధిల్లెను. తగినకాలమునందు సౌలుయొక్క రాజ్యభారమును స్వతంత్రించుకొనెను. దావీదు యొక్క నమ్మకత్వము మనకు ఉండినట్లైతే అది ఎంతటి ఆశీర్వాదముగా ఉండును! ప్రభు వలన ఏర్పరచుకొనిన దాసులకు విరోధముగా ఎన్నడును మాట్లాడకుడి, చేతులను ఎత్తకుడి. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? వారిని నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే”(రోమీ. 8:33).

ప్రభువుపై ప్రేమ గలవారు, అభిషేకము చేయబడిన దేవునియొక్క దాసులపై తప్పులను కనుగొనుటకు తొందరపడరు. వారియొక్క ఔన్నత్యమును కొనియాడుతారు. తప్పిదములను చూచినప్పుడు, వారిని అవమానపరచకండా ప్రభువుయొక్క సన్నిధిలో మోకరించి వారికై కన్నీటితోను, భారముతోను ప్రార్థించెదరు. దావీదునకుగల నమ్మకత్వము ఎంతటి అమోఘమైనది!

దావీదు యొక్క నమ్మకత్వమును సొలోమోను చూచెను. అందుచేతనే సొలోమోను ప్రార్థించుచున్నాను, “నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును(నమ్మకత్వమును) నీతిని అనుసరించి యథార్థమైన మనస్సుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగుపరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందుమహాకృపను చూపియున్నావు”(1.రాజులు. 3:6) అని మనవిచేసెను. దేవుని బిడ్డలారా, ప్రభువునకు నమ్మకస్తులైన ఉండుడి. అభిషేకింపబడిన వారిపై తప్పులను కనుగొనే స్వభావమును మీవద్ద నుండి తొలగించి, దైవిక సమాధానముతోను, సాత్వికముతోను నడుచుకొనుడి.

 

నేటి ధ్యానమునకై: “నమ్మకమైనవారిని యెహోవా కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన విస్తారమైన ప్రతిఫలమిచ్చును”(కీర్తన.31: 23).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.