No products in the cart.
జూలై 03 – ముందర నడిచి వెళ్లుచు!
“తాను వారి ముందర నడిచి వెళ్లుచు, తన సహోదరుని సమీపించుచు”(ఆది. 33:3)
యాకోబుయొక్క జీవితమునందు జరిగిన ప్రాముఖ్యమైన సంభవమును ఈ లేఖన వాక్యమునందు చదువుచున్నాము. యాకోబును, ఏశావును కవల పిల్లలు. ఏశావు వేటాడుటయందు నేర్పరియు బలవంతుడైయుండెను. అయితే యాకోబు, గుడారమునందు నివసించువాడై గుణవంతుడైయుండెను. ఏశావుయొక్క జేష్ఠత్వపు హక్కును, అతనికి రావలసిన తండ్రియొక్క ఆశీర్వాదమును యాకోబు బహు తంత్రముగా తీసుకొనినందున్న, తన సహోదరుడు తనను చంపివేయును అని భయపడి ఇంటిని విడచి పారిపోయెను.
పలు సంవత్సరములు గతించిపోయెను. ఇద్దరును ఒకరినొకరు కలుసుకొనలేదు. ఇప్పుడు యాకోబునకు భార్యలను, ఉపపత్నులను కలిగి పదమూడుమంది పిల్లలును పుట్టెను. విస్తారమైన సంపదయు కలిగెను. ఆయినను అన్నను గూర్చిన భయము తనతోపాటు కలిగియుండెను.
తన సహోదరుడైన ఏశావును కలుసుకొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, యాకోబు వెనుకంజ వేయుటకు ప్రారంభించెను. ఏశావు తన మీదకు వచ్చి చంపునేమో అని తలంచి, ముందుగా తన దాసులను, దాని తరువాత తన మందలను, దాని తరువాత ఉపపత్నులను, తరువాత పిల్లలను ఉంచి, తాను చివరగా నడచుచు వచ్చెను. యాకోబు మిక్కిలిగా భయపడి తొందరపడెను (ఆది.32:7). అప్పుడే ఆయన ప్రభువును వెతికెను, ప్రార్థన చేయుటకు ప్రారంభించెను. ప్రభువుయొక్క కనికరమునకును, బలమునకును కనిపెట్టెను. ఆయన చేసిన ప్రార్థన ఎంతటి ఆసక్తికరమైనది!
“నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా;… నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని, నాసహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను”(ఆది. 32:9-11) అని మనసారా ప్రార్థించెను.
ఆ ప్రార్ధన ఒక సాధారణమైన ప్రార్థన కాదు. రాత్రంతయు సంపూర్ణముగా కొనసాగించి ప్రార్థించిన ప్రార్థన, ప్రభువుతో పోరాడి ప్రార్థించిన ప్రార్థన. అట్టి ప్రార్థనయందు ప్రభువును గట్టిగా పట్టుకుని, ప్రభువు యొక్క తాకిడి తనకు దొరుకు వరకును ఆయనను విడిచి పెట్టలేదు.
ప్రార్ధించి ముగించిన తరువాత ఏమి జరిగిందో తెలుసా? అంతవరకు వెనుకంజవేస్తూ ఆఖరివాడై నడుచుచు వచ్చినవాడు, ప్రార్థించిన తరువాత ముందుకు వచ్చెను. “తాను వారి ముందర నడిచి వెళ్లుచు, తన సహోదరుని సమీపించుచు” అని ఆది. 33:3- నందు చెప్పబడియున్నది. అవును, ఆ ప్రార్ధన యాకోబును ధైర్యవంతునిగా మార్చివేసెను. ప్రభువు తనతో కూడా ఉన్నాడు అను గ్రహింపును తీసుకువచ్చెను.
దేవుని బిడ్డలారా, ప్రార్ధన మీయొక్క పరిస్థితులను మార్చును అనుటను సంపూర్ణముగా విశ్వసించుడి.
నేటి ధ్యానమునకై: “నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును; నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును”(కీర్తన. 18:29).