AppamAppam - Telugu

జూలై 01 – ఒకచోటనే కూర్చబడి!

“ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి, ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను”(ఆది.1:9)

ప్రభువు సృష్టియొక్క మూడవదినమున  ప్రారంభమునందు, జలమును ఒక్కచోటనే కూర్చబడునట్లు చేసినట్లుగా, జలముచే బాప్తిస్మము పొందిన విశ్వాసులు ఒకటిగా కూర్చబడి సంఘముగా వచ్చుచున్నారు. రక్షణపొందుచున్నవారిని ప్రభువు అనుదినము సంఘమునందు చేర్చుచువచ్చెను. మొదటి దినము సృష్టియొక్క వెలుగు, రక్షణకు సాదృశ్యమైనది. రెండవ దినముయొక్క జలము బాప్తీస్మమునకును, ఆకాశవిశాలము ఉన్నత జీవితమునకు సాదృశ్యమాయెను. అదే విధముగా మూడవ దినము ఒకటిగా కూర్చబడిన జలము సంఘమునకు సాదృశ్యమైయున్నది.

ప్రభువు విశ్వాసులను వారివారి సొంత ఇష్టము చొప్పున తిరగనివ్వక సంఘముగా ఒకటిగా కూర్చి వారిని ఐక్యతతో నడిపించుటకు ఆజ్ఞాపించెను. బైబిలు గ్రంథము క్రీస్తును శిరస్సుగాను, సంఘమును శరీరముగాను వర్ణించుచున్నది. ప్రభువు తన స్వరక్తముచే సంపాదించుకున్న సంఘమునందు, మీరు ఐక్యతతో అక్కడనున్న దేవుని పిల్లలతో ఒక్కటై ఏకమైయుండుడి. “ఇదిగో!సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము?”(కీర్తన.133:1) అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు.

దేవునిచే రక్షింపబడియున్న బిడ్డలకు ఆత్మసంబంధమైన ఐక్యత మిక్కిలి అవశ్యము. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు(హెబ్రీ.10:25). ఆది అపోస్తులుల యొక్క దినములయందు, రక్షణపొందుచున్నవారిని సంఘమునందు ఐక్యతలో చేర్చుచున్నందున, సంఘములు విశ్వాసమునందు స్థిరపరచబడి దినదినమునకు విస్తరించెను. ఆత్మల సంపాద్యము చేయుటద్వారా విశ్వాసులు విస్తరించిరి. విశ్వాసులు విస్తరించుటవలన సంఘము విస్తరించెను. సంఘము విస్తరించుటద్వారా ప్రభువుయొక్క రాజ్యము భూమిపై కట్టబడుచున్నది.

ఐగుప్తుయొక్క దాసత్వమునుండి బయటకువచ్చిన ఇశ్రాయేలియుల సర్వసమాజమునకు మొట్టమొదటిగా “సంఘము” అని పేరు వచ్చెను. వారు దేవునిచే ఏర్పరచబడి ప్రత్యేకించబడినవారు. వారు ప్రభువు యొక్క స్వాస్థ్యమును పాలైయున్నారు. నీటి బొట్టులు ఒక్కటై విస్తారమైన జలమైనట్టుగా వారు కుటుంబముగా తరలి దేవుని సంఘముగా మారిరి. ఇశ్రాయేలీయులు లక్షలకొలదిగా ఏకముగా కూర్చబడి  ముందుకు సాగుతున్న దృశ్యము ఎంతటి మహత్యము గలదై యుండును! వారు దేవుని సైన్యముగా, దేవుని సంఘముగా బహు ఠీవిగా నడిచిరి.

“పరలోకమునందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము” అని  హెబ్రీ.12:23 నందు సూచించబడియున్నది. దేవుని బిడ్డలారా, మీరును లోకమంతటనున్న  విశ్వాసులను ఏకముగా కలిసి  సార్వత్రిక సంఘమైయున్న సంఘముగా ఆత్మతో జతపరచబడియున్నారు. మీరు క్రీస్తుయొక్క శరీరముగా కనబడుట ఎంతటి మహిమగల అంశము!

 

నేటి ధ్యానమునకై: “పరిశుద్ధమైనదిగాను,  నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను”(ఎఫెసీ.5:27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.