No products in the cart.
జూన్ 27 – తెలియదుగాని, తెలిసికొందువు!
“నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని, యికమీదట తెలిసికొందువని చెప్పగా”(యోహాను.13:7)
ప్రభువు చేయుచున్న కార్యములను మీరు తెలిసికొనవలెనంటే, మీకు ఆత్మీయ నేత్రములు కావలెను. ఆయన యొక్క స్వరమునకు తెరవబడియున్న చెవులు కావలెను.
ఒకానొక స్థలమునందు, ఒక సంఘముయొక్క పెద్ద అకస్మాత్తుగా మరణించెను. ఆయన బహు భక్తిపరుడు, ప్రభువును ప్రేమించినవాడు. ఎదురుచూడని విధముగా గుండెపోటు ఆయనకు వచ్చెను. ఆయన యొక్క భార్య, బిడ్డలు అందరును ఏడ్చుచు విలపించిరి. ఎందుకని ప్రభువు మాకు ఇలా చేసెను. ఎందుకని మా తండ్రిగారిని తీసుకొనెను, అని చెప్పుచూ ఆదరణలేనివారై అంగలార్చిరి.
కొద్ది దినములు గడిచెను. బంధువులతో కలిసి భార్యయు, బిడ్డలను ఏడ్చుచున్నప్పుడు, అకస్మాత్తుగా ఆ గది అంతయు, మహిమగల ప్రకాశముతో నిండెను. మరణించిన ఆ సహోదరుడు, అసంఖ్యాకులైన దేవదూతలతోకూడా వచ్చెను. అదే ఆకారముతోను, అదే సున్నితమైన చూపుతోను. వచ్చిన వెంటనే భార్యా, బిడ్డలను చూచి చిరునవ్వుతో, ‘ఎందుకని ఏడ్చుచున్నారు? ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయనను స్తుతించుడి. ప్రభువు మంచివాడు ఆయన కృప నిత్యముండును’ అని చెప్పెను. మరియు, దేవదూతలు బయలుదేరినప్పుడు, ఆయన వారితోకూడా వెళ్ళిపోయెను. ఆ సంభవము వారియొక్క జీవితమును మార్చివేసింది. మిక్కిలి ఆదరణను పొందిరి. ప్రభువును స్తుతించి మహిమపరచుటకు ప్రారంభించిరి.
అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు, “సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము; నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును”(1 థెస్స. 4:13-14). మరణము ఒక ముగింపుకాదు, అది ఒక విశ్రాంతి. మనదేవుడు పునరుత్థానమును, జీవమునైయున్నాడు. ఆయనను విశ్వసించినవారు చనిపోయినను బ్రతుకును (యోహాను.11:25).
మీరు మరణించిన తరువాతనందుగాల పరిస్థితులను గూర్చి, బైబులు గ్రంధమునందుగల ఉపదేశములను, ప్రభువుయొక్క మాటలను ఎరిగియుండవలసినది అవశ్యము. యేసుక్రీస్తును మరణమేగాని, పాతాళమేగాని, సమాధియేగాని బంధించి ఉంచ లేకపోయెను. యూదా యోధుల సైనికులేగాని, రోమా ప్రభుత్వపు సైనికులేగాని సమాధికి ముద్రనువేసి కావలియుండలేక పోయెను. యేసుక్రీస్తు జీవముతో లేచెను. కావున మీకును పునరుత్థానమునందు నమ్మిక కలదు.
దేవుని బిడ్డలారా, ఎదురుచూడని విధముగా అపాయములు సంభవించవచ్చును, ప్రమాదములు రావచ్చును, మరణములు సంభవించవచ్చును. ఎందుకని ప్రభువు ఈ విధముగా చేసెను అని మీయొక్క హృదయము అంగలార్చుచున్నప్పుడు, ప్రభువుయొక్క జవాబు ఏమిటి? ‘నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని, యికమీదట తెలిసికొందువు’ అనుటయే ఆయన జవాబు.
నేటి ధ్యానమునకై: “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము”(రోమా. 8:28).