AppamAppam - Telugu

జూన్ 20 – ఏలికల సమక్షమున!

“నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల; నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము” (సామెతలు. 23:1)

సొలొమోను రాజు జ్ఞానముగా రాజ్యపరిపాలన  చేసిన  గొప్ప రాజుగా ఉండెను. ఏలీకల తంత్రములను, వారు ఎలా ఇతరులకు ఉచ్చులను బిగించి పట్టుకొందరు  అనుసంగతిని ఆయన ఎరిగియుండెను. అందుచేతనే ఆయన వ్రాయుచున్నాడు, “నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల, అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు”(సామెతలు 23:3).

నేడు గొప్ప ధనవంతులు ప్రభుత్వమందున్న అధికారులను మధు, మగువ, మరియు ధనము మొదలగు వాటితో తమ వశ పరుచుకుంటారు. అదే విధముగా అనేకులు మిమ్ములను మత్తులునుగా చేయుటకు ముందుకురావచ్చును. మీ ఎదుట పలు రుచిగల పదార్ధములను (ధనము, పేరు, ప్రఖ్యాతి) పెట్టుచున్నప్పుడు, అవి ఎట్టి వికారమునకై ఇవ్వబడుచున్నది అను సంగతిని గమనించుడి. సాతాను యొక్క తంత్రములను తెలుసుకొనుడి, ఉచ్చులయందు చిక్కుకొనకుడి.

ఎలుకను పట్టుకొనుటకు ఎలుక బోనులో మసాలావడను పెట్టి, దానిని మురిపింతురు, మసాలావడ యొక్క సువాసనను, రుచిని ఆశించిన ఎలుక వచ్చి చిక్కుకొనును. ఇలాగునే ఆనాడు లోక భోగేఛ్ఛలను చూపించి, ఇశ్రాయేలీయుల న్యాయాధిపతియైన సంసోనును, సాతాను బోనులో బంధించి వేసెను. ఎంతటి దౌర్భాగ్యమైన దుస్థితి!

ఏసుక్రీస్తు మరొక ఏలికను గూర్చి హెచ్చరించెను. అతడే ఈ లోకాధికారి (యోహాను 14:30). యేసు ఉపవాసముండి ఆకలిగొనియున్నప్పుడు, ఈ లోకాధికారి ఆయన యెదుట ఆహారమును తెచ్చి పెట్టుచున్నాడు. అది ఎట్టి ఆహారము? వట్టి రాళ్లు. నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను(మత్తయి.4:3). అయితే ప్రభువు సాతానా, పొమ్ము అని వాడిని తరిమెను. శోధనలకు ఆయన చోటివ్వలేదు.

బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు”(సామెతలు 23:3). “మోసపుచ్చు ఆహారము” అనుట పాపమును సూచించుచున్నది. లోకమునందు కనబడుచున్న శరీరేచ్ఛలను సూచించుచున్నది. లోకము నందు గల మనుష్యులు తమ కన్నులతో భోజనము చేయుచున్నారు. సినిమా, వ్యభిచారము మొదలగు వాటిని భోజనముగా  గావించి, దురాత్మలకు బానిసగా జీవించుచున్నారు.

యేసుక్రీస్తు ఒక భోజనము గూర్చి చెప్పుచున్నాడు. అది మనయందు నిత్య జీవమును తీసుకొని వచ్చును. యేసు చెప్పెను, “పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే; ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును”(యోహాను.6:51). ప్రభువు యొక్క మాటలే మనకు ఆహారముగా, ఆత్మీయ మన్నగా ఉన్నది.

దేవుని బిడ్డలారా, బైబిలు లేఖన వాక్యమును ఆహారమువలె ఎంచుకుని ఉత్సాహముతో భుజించెదరా?

 

నేటి ధ్యానమునకై: “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని;  నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి”(యిర్మీయా 15:16 ).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.