No products in the cart.
జూన్ 15 – అద్భుతములను పొందుకొనుటకు!
“రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి” (యెహోషువ.3:5)
మీరు ఎందుకని పరిశుద్ధముగా జీవించవలెను? అవును, మీ జీవితమునందు పరిశుద్ధత ఉంటేనేగాని మీరు ప్రభువు యొద్దనుండి అద్భుతములను ఎదురుచూడగలరు. మనుష్యుడు దేవునివద్దకు సమీపింప ప్రయత్నించునప్పుడెల్లా, అతడు పరిశుద్ధముగా జీవించడా అని ప్రభువు ఆశతో ఎదురుచూచుచున్నాడు.
అనేకులు చెప్పుచున్నది ఏమిటి? ‘నా కుటుంబమునందు ఈ అద్భుతమును చేసినట్లయితే నేను ప్రభువును అంగీకరించెదను. నాకు మంచి ఉద్యోగము దొరికినట్లయితే, క్రీస్తును సేవించెదను. నాకు మగపిల్లవాడు పుట్టినట్లయితే, కుటుంబముతోసహా ప్రభువును పూజించెదము’ అని ఎంత చెప్పుచున్నారు, తీర్మానించుచున్నారు.
అయితే, ప్రభువు యొక్క వాక్యము ఏమని చెప్పుచున్నది? మీరు మొదటిగా మిమ్ములను పరిశుద్ధపరచుకొనుడి. తరువాత ప్రభు వద్దనుండి అద్భుతమును ఎదురుచూడుడి. యేసు చెప్పెను, “కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని, మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” (మత్తయి 6:33). దేవునియొక్క నీతియే ఆయనయొక్క పరిశుద్ధత.
ఒక దైవజనుడు ఒక ఉజ్జీవమహాసభకు వెళ్ళు నిమిత్తము సిద్ధపడుచున్నప్పుడు, దానిని నిర్వహించుచున్న సహోదరులు, “జనులు అద్భుతములను ఎదురుచూస్తున్నారు. అనేకులు దైవిక స్వస్థతను, శక్తిని, విడుదలను ప్రవచనములను ఎదురుచూస్తున్నారు. అందుచేత సిద్ధపాటుతో రండి” అని చెప్పిరి. దైవజనుడు కూడా దానికై ప్రార్ధించుటకు ప్రారంభించెను.
ఆ దైవజనుడు, ప్రభువుయొద్ధ మోకరించి, ప్రభువా, జనులు అద్భుతములను కాంక్షించుచున్నారు. నీవు అద్భుతములను ఖచ్చితముగా చేసి, తీరవలెనని అడిగినప్పుడు, ప్రభువు: “నేను అద్భుతములను చేయుటకు సిద్ధముగా ఉన్నాను, నా జనులు పాపజీవితమును విడిచి పరిశుద్ధముగా జీవించుటకు సిద్ధముగా ఉన్నారా?”అని అడిగెను.
యెహోషువా జనులను చూచి, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి”(యెహోషువా.3:5) అని చెప్పెను. మోషేతో నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, మూడవనాటికి నేను ప్రజలందరి కన్నులయెదుట సినాయి పర్వతముమీదికి దిగివచ్చెదను అనెను (నిర్గమ.19:10-11). ప్రభువు కొరకు మీరు చేయవలసినది చేసి పరిశుద్ధతయందు సాగుచున్నప్పుడు. ఆయన మీకొరకు చేయవలసిన దానిని నిశ్చయముగా చేయును.
దేవుని బిడ్డలారా, మీయొక్క సమస్యలును, పోరాటములును రోజురోజుకీ అధికమవుచున్నదా? వెంటనే క్రీస్తుయొక్క పాదములయందు కూర్చుండి మిమ్ములను పరిశుద్ధపరచుకొనుడి. యోర్దానును వెనకకు మళ్ళించి ఇశ్రాయేలీయులను దాటివెళ్ళినట్లు చేసి, అద్భుతమును జరిగించినవాడు, నిశ్చయముగానే మీ జీవితమునందును అద్భుతములను జరిగించును.
నేటి ధ్యానమునకై: “ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను, లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.” (యోబు.9:10).