No products in the cart.
మే 07 – జయమును ఇచ్చు దిక్కు
“తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను (హెచ్చు) జయము కలుగదు” (కీర్తనలు. 75:6).
బైబిలు గ్రంథమునందు మొత్తానికి 150 కీర్తనలు ఉన్నాయి. ఇందులో దావీదు వ్రాసిన కీర్తనలు 73 కీర్తనలు. ఆసాపు అను భక్తుడు వ్రాసినది 12 కీర్తనలయైయున్నవి. కోరాహు కుమారులు వ్రాసిన కీర్తనలు 11 కీర్తనలు. సొలోమోను 2 కీర్తనలను వ్రాసియున్నాడు. మోషే ఒక కీర్తనను, ఈతాను అనువాడు ఒక కీర్తనను వ్రాసియున్నారు. ఇవి గాక, తెలియజేయబడని రచయితల చేత వ్రాయబడిన 50 కీర్తనలు కూడాను బైబిలు గ్రంధమునందు కలదు. ఇట్టి కీర్తనల ద్వారా పరిశుద్ధుల యొక్క అంతరంగపు స్థితిని మనము తెలుసుకొనుచున్నాము.
నేడు మనము ధ్యానించుచున్న లేఖన వచనములో, ఆసాపు అను భక్తుడు ఒక వాస్తవమును చెప్పుచున్నాడు. తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను (హెచ్చు) జయము కలుగదు. ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా శత్రువులు బయలుదేరి వచ్చినప్పుడు వారు తమకు సమీపమునున్న మిగతా దేశములు ముందుకు వచ్చి తమకు సహాయము చేయదా అని ఆసక్తితో ఎదురుచూచెదరు. తూర్పున ఉన్న ఐగుప్తు నుండి సహాయము రాదా, పడమటి నుండి సహాయమునకు ఎవరైనాను గుర్రపు సైన్యమును పంపించరా, అని తలంచి ఎదురుచూచి కనులు పూచెనే గాని సహాయము రాలేదు. మనము చూడవలసిన దిక్కు పడమర, తూర్పు, ఉత్తరము, దక్షిణము కాదు. అలాగైయితే మనము ఏ దిక్కున తేరి చూడవలెను?
దావీదు రాజు చెపుచున్నాడు: “కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును భూమ్యాకాశములను సృజించినవాడుయైన యెహోవావలననే నాకు సహాయము కలుగును” (కీర్తనలు. 121:1,2). మనము ప్రేమించుచున్న ప్రభువు మనకు సహాయమును పంపించువాడు. కొద్దిమందైనను, ఎక్కువమందైనను జయమును అనుగ్రహించుట ఆయన యొక్క చేతులలోనే ఉన్నది.
ఇశ్రాయేలీయులకు విరోధముగా సముద్రపు ఇసుక రేణువులవలె మిద్యానీయులు వచ్చినప్పుడు గిద్యోను తూర్పు దిక్కున, పడమటి దిక్కున, ఉత్తరపు దిక్కున, దక్షిణపు దిక్కున తేరి చూడలేదు. ఉన్నతమునకు తేరి చూచి ప్రభువునే ఆనుకొనెను. ప్రభువు వారికి తోడుగా ఉన్నందున మూడువందల మందితో మిద్యానీయుల యొక్క పాళమునే విధ్వంశముచేసేను.
ఒక దినమున హిజ్కియా రాజునకు విరోధముగా యుద్ధము ఏర్పడెను. అష్షూరురాజైన సన్హెరీబు కలత చెందునట్లుగ పత్రికను వ్రాసి పంపించెను. అంతటి గొప్ప అష్షూరుల యోధులను ఎలాగు జయించుట? తూర్పు దిక్కున చూచుటయా? పడమటి దిక్కున చూచుటయా? వీటి రెండిటిని కాక ఆయన దేవునే తేరిచూచెను. జయము ప్రభువు వద్ద నుండియే వచ్చును. ప్రభువు తన యొక్క దూతను పంపించినప్పుడు ఒక దేవదూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో ప్రవేశించి లక్షా యెనుబది యైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా, వారందరును మృత కళేబరములుగా పడీఉండిరి (యెషయా. 37:36).
దేవుని బిడ్డలారా, మీరు పలు రకాల సమస్యలలో చిక్కి ఉండవచ్చును. ఎవరు ఇట్టి సమస్యల నుండి విడిపించెదరు అని మీరు గతి తప్పి నిలబడ వచ్చును. ప్రభువు నేడు ఇచ్చుచున్న వాగ్దానము ఏమిటి? తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను (హెచ్చు) జయము కలుగదు. యెహోవా యొద్ద నుండి మాత్రమే సహాయము వచ్చును అనుటయైయున్నది.
నేటి ధ్యానమునకై: “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక” (1. కోరింథీ.15:57).
