No products in the cart.
మే 17 – ఏడ్పును, సంతోషమును
“వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును” (యిర్మియా. 31:9)
ప్రభువు మంచివాడు ఆయన తన యొద్దకు వచ్చిన వారిని వెలుపలకు త్రోసివేయడు. వారిని ప్రేమతో త్రోవ నడిపించును. కన్నీటితో వచ్చుచున్న వారి యొక్క కన్నీటిని తుడచి, ఆనంద సంతోషాలను కలుగజేయును. దుఃఖమును సంతోషముగా మార్చువాడు. మారాను మధురముగా చేయువాడు.
హన్నా కన్నీటితో దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించి ఆశీర్వాదకరమైన సమూయేలును దయచేసి ఆమెను ఆనంద సంతోషాలు గలదానిగా చేసెను (1. సమూ. 1:20). హిజ్కియా యొక్క కన్నీటిని చూచి, ప్రార్థనను ఆలకించి, అతని యొక్క ఆయూషు దినములను పదిహేను సంవత్సరములు పొడిగించి సంతోషంప చేసెను (యెషయా. 38:5,6).
మార్త మరియల యొక్క కన్నీటిని చూసి, వారి యొక్క సహోదరుడైయున్న లాజరును ప్రాణాలతో తిరిగి లేపి ఆధరణను కలిగించెను. అవును, ఆయన వద్దకు వచ్చుచున్న ప్రతి ఒక్కరిని ఆయన వెలుపలకి త్రోసివేయడు.
ప్రభువు వద్దకు వచ్చుచున్నప్పుడు పాపములు తొలగింపబడి రక్షణ లభించుచున్నది. శాపములు బాపబడి ఆశీర్వాదము లభించుచున్నది. వ్యాధులు తొలగించబడి ఆరోగ్యము లభించుచున్నది. మనోవేదన బాపబడి సమాధానము లభించుచున్నది.
పాపము చేసిన దావీదు కన్నీటితో ప్రభువు వద్దకు తిరిగి వచ్చి, “నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకుము” (కీర్తన. 51:11) అని విలపించెను. ప్రభువు దావీదును హక్కున చేర్చుకొనెను, పాపమును క్షమించెను.
పాపపు ఒప్పుకోలుతోను, నిజమైన పచ్చాతాపముతోను తండ్రి వద్దకు పాపక్షమాపణ కోరుటకు కుమారుడు వచ్చినప్పుడు, అట్టి కుమారుని అంగీకరించుటకు తండ్రి పరిగెత్తుకొని రాలేదా? కుమారుడా అని హత్తుకొని ఆదరణను కలిగించలేదా? అదే విధముగా మారుమనస్సు పొందిన మీరు ప్రభువు వద్దకు వచ్చుచున్నప్పుడు, ఆయన మిమ్ములను హక్కున చేర్చుకొని, అంగీకరించుటకు, ఆసక్తి గలవాడైయున్నాడు.
మీరు ఒక్క అడుగు తీసి ప్రభువు వద్దకు వచ్చుచున్నప్పుడు, ఆయన పది అడుగులు తీసి మిమ్ములను ఎదుర్కొనుటకు వచ్చును. మీ యొక్క హృదయమును తన యొక్క వెలుగుతో నింపును. మీయొక్క ఏడ్పును ఆనందముగా మార్చును. ఆయన మీయొక్క కుటుంబమును తన యొక్క మహిమతో కప్పును. నీతిమంతుల యొక్క గుడారమునందు రక్షణ సునాద శబ్దము కలదు. ఆటలును, పాటలును స్తుతియును కలదు.
దేవునబిడ్డలారా, మీయొక్క జీవితమునందు తుఫాను విచుచు, తట్టుకోలేని వేదనలు ఆవరించినపుడు, కన్నీటితో యేసుని వద్దకు పరిగెత్తుకొని రండి. ఆయన మిమ్ములను చేర్చుకొని, అంగీకరించును. ఆయన మీకు సంతోషమును, సమాధానమును ఆజ్ఞాపించును. మీ యొక్క గృహము నీతిమంతుని యొక్క గుడారముగా రక్షణను ప్రకటించేటువంటి గృహముగా ఉండవలెను. ప్రభువును స్తుతించేటువంటి స్తుతులతోను, నూతన గీతములతో నిండియుండవలెను.
నేటి ధ్యానమునకై: 📖”యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు, తిరిగి సీయోనునకు వచ్చెదరు; వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును” (యెషయా. 35:9,10).