No products in the cart.
మార్చి 10 – శత్రువులను ప్రేమించే ప్రేమ!
“మీ శత్రువులను ప్రేమించుడి” (మత్తయి. 5:44).
మనలను ప్రేమించు వారిని, మనకు సహాయము చేసి, మనలను కొనియాడుచు ఉత్సాహపరచుచున్న వారిని ప్రేమించుట సులువు. అయితే మనలను ద్వేషించి, నాశనము చేయవలెనని ప్రయత్నించుచున్న శత్రువులను ప్రేమించుట బహు కఠినమైనది.
అయితే కల్వరి ప్రేమ చేత హృదయము నింపబడుచున్నప్పుడు ఏదియును కఠినముగా ఉండదు. మీరు శత్రువులై ఉన్నప్పుడు, ఏసు మిమ్ములను వెదకి వచ్చెను కదా? పాపులుగాను, దుర్మార్గులుగాను ఇశ్రాయేలు యొక్క పాళెమునకు వెలుపుట ఉన్నవారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతగా ప్రేమను కనబరిచి, పాపములను క్షమించి, తన యొక్క బిడ్డగా స్వీకరించనే! అట్టి ప్రేమ చేత మీరును శత్రువులను ప్రేమించగలరు.
శత్రువులను ప్రేమించుటయందు క్రీస్తే ఆదర్శవంతుడు. ఆయన శత్రువులు ఆయనను సిలువలో అంతగా శ్రమపరచినప్పుడు ఆయన వారిని ప్రేమించి, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” అని చెప్పి గోజాడెను కదా? అదియే శత్రువులను ప్రేమించు ప్రేమ.
యేసు చెప్పెను: “మీ శత్రువులను ప్రేమించుడి; మిమ్మును శపించువారిని ఆశీర్వదించుడి; మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి; మిమ్మును నిందించు వారికొరకును మిమ్మును హింసించు వారికొరకును ప్రార్థన చేయుడి” (మత్తయి. 5:44).
పాత నిబంధనయందు కూడాను ప్రభువు ఇట్టి నియమమును ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియుండెను. “నీ శత్రువుని యెద్దుయైనను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల, అగత్యముగా దాని తోలుకొనివచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను? అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను” (నిర్గమ. 23:4,5).
“మీరు శత్రువులను ప్రేమించుడి, మేలును చేయుడి, ప్రతిఫలమును ఆశింపక అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు; ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియైయున్నాడు” (లూకా. 6:35) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
క్రీస్తు ప్రసంగించిన దానినే అపోస్తులులు కూడాను ప్రసంగించిరి. వారు కూడాను శత్రువులను ప్రేమించుడి అని చెప్పిరి. “నీ శత్రువు ఆకలిగొనియుంటే, అతనికి భోజనము పెట్టుము; అతడు దప్పిగొనియుంటే, అతనికి దాహమిమ్ము; …. నీవు కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” (రోమీ. 12:20,21).
దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించుట చేత మీయొక్క అంతరంగమునందు దైవిక సమాధానము నివాసము ఉండును. మీయొక్క క్రియలను చూచి ప్రభువు మనస్సునందు ఆనందించును అను నిశ్చయతను పొందుకొందురు. అంత మాత్రమే కాదు, శత్రువులను కూడా మీరు, మీ పక్షమునందు సంపాదించుకొందురు.
నేటి ధ్యానమునకై: “నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము; వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొనును” (సామెతలు. 24:17,18).
