Appam, Appam - Telugu

ఫిబ్రవరి 01 – వ్యక్తిగత ప్రార్థన!

“యేసు (ఆయన) పెందలకడనే లేచి, యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు. 1:35).

మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరము. మీకు లోతైన, వ్యక్తిగత సంబంధము దేవునితో ఉండవలెను. మీకు క్రీస్తుతో అత్యధికమైన సన్నిహిత సహవాసము ఉండవలెను. కాబట్టి, ఈ నెల నుండి, మీ వ్యక్తిగత ప్రార్థన సమయాన్ని పెంచుకోవడానికి తీర్మానించుడి.

యేసుక్రీస్తుకు కూడాను వ్యక్తిగత ప్రార్థన అవసరమైయుండెను. తండ్రితో ఏకాంతమునందు మాట్లాడుటకు కోరుకొనెను, గుంపులో నుండి తన్ను తాను ప్రత్యేక పరచుకొని, జనసమూహము నుండి దూరముగా వెళ్లి, మరియు తన ప్రియమైన శిష్యులను కూడాను వెనుక వదిలి పెట్టి వెళ్ళెను. ఆయన ఏకాంత ప్రదేశమునకు వెళ్లి తెల్లవారుజామున ప్రార్థించెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అయితే, ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను; బహుజన సమూహములు ఆయన మాట వినుటకును, తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను” (లూకా 5:15-16).

ఆ దినములయందు, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు ఎక్కివెళ్ళెను, రాత్రంతయును దేవునికి ప్రార్థన చేయుచుండెను (మార్కు 6:46). మరలా మనము ఇలా చదువుచున్నాము: “వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను, ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాల మైనప్పుడు ఒంటరిగా ఉండెను. (మత్తయి 14:22-23)

యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ఎత్తిచూపుటకు అనేక సందర్భాలను బైబిలు గ్రంధమునందు సూచింప బడియున్నాయి. వ్యక్తిగత ప్రార్థన మనకు చాలా అవసరము. అంతరంగ పురుషునియందు బలమును పొందు కొనుటకు ఇది చాలా ముఖ్యమైనది.

ఎవరైతే తమ దినచర్యను దేవునితో వ్యక్తిగతముగా సంభాషించడము ద్వారా ప్రారంభించువారు దైవిక నడిపింపును పొందడమే కాకుండా, ఆ దినాన్ని ఎదుర్కోవడానికి మరియు దానిని విజయవంతముగా ముగించడానికి కావలసిన బలమును మరియు కృపను కూడాను పొందుకుంటారు.

నేడు, చాలా మంది ప్రజలు బహిరంగ సభలలో ప్రార్థిస్తారు, సంఘ సేవలలో మరియు సమూహ సమావేశాలలో ప్రార్థిస్తారు. అయినప్పటికీ వారు దేవునితో వ్యక్తిగత సహవాసములో ఆనందముగాను మరియు లోతుగాను ప్రార్థించడానికి కష్టపడుచు ఉంటారు. అయితే రోజులు గడిచేకొద్దీ, ఈ వ్యక్తిగత ప్రార్థన లేకపోవడము చేత వారి జీవితములలో అలసటయు, అస్థిరత్వమును మరియు చివరికి ఓటమికి దారితీస్తుంది.

దానియేలు తరచుగా తన స్నేహితులతో కలిసి ప్రార్థించినప్పటికీని, వ్యక్తిగత ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (దానియేలు 6:10).

దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమును ఏకాంతమునందు రాజులకు రాజును కలవడానికి దృఢమైన తీర్మానమును తీసుకొనుడి.

నేటి ధ్యానమునకై: “ఉదయమునకు నీవు సిద్ధపడి, ఉదయమున సీనాయి కొండయెక్కి, అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను” (నిర్గమ. 34:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.