No products in the cart.
నవంబర్ 27 – కఠినమైన ఉపదేశము!
“యిది కఠినమైన (మాట) ఉపదేశము, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి” (యోహాను. 6:60)
సులువైన ఉపదేశములు కలవు. కఠినమైన ఉపదేశములు కూడాను కలవు. రెండును మనకు ప్రయోజనకరమైనదే. యేసు స్వస్థపరచువాడు, యేసు అద్భుతమును చేయువాడు, యేసు విడిపించువాడు, యేసు కన్నీరును తుడచువాడు అను ఉపదేశములన్నియును సులువైన ఉపదేశములు.
అదే సమయమునందు ‘ఒక్కడు నన్ను వెంబడింప గోరినట్లయితే తన శిలువను మోసుకొని ఇందుమూలముగా నన్ను వెంబడింపవలెను” అనియు “ఇరుకైన ద్వారములలో ప్రవేశించుడి” అని యేసు చెప్పినప్పుడు, దానిని కఠినమైన ఉపదేశము అని చెప్పుచున్నాము. ప్రభువు మన కొరకు ఏమేమి చేయుచున్నాడు అను సంగతిని, ఏమి చేయబోవుచున్నాడు అను సంగతిని వినుచున్నప్పుడు, మన యొక్క హృదయము సంతోషించుచున్నది. అది ఆనందకరమైన ఉపదేశముగా ఉన్నది. అయితే మీరు ప్రభువు కొరకు ఏమి చేయవలెను అని చెప్పుచున్నప్పుడు, అది కఠినమైనదిగా అనిపించుచున్నది.
మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశమును తీసుకొని వచ్చెను. అయితే యేసు కృపా నియముగల ఉపదేశములను తీసుకుని వచ్చెను. ఈ రెండిటిలో గైకొనుటకు కఠినమైనది ఏది? ధర్మశాస్త్రమా లేక కృప యొక్క నియమమా?
ధర్మశాస్త్రము వ్యభిచారము చేయకయుందువు గాక అని చెప్పుచున్నది. అయితే ప్రభువు దీనిని సులువైనదిగా చేయక ఇంకా కఠినపరిచెను. ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని ఆయన చెప్పెను. ఇది ఎన్నో రేట్లు కఠినమైన ఉపదేశము. పాత నిబంధనలో వ్యభిచారము చేయు చర్యకే శిక్ష. క్రొత్త నిబంధనలో అయితే వ్యభిచారపు తలంపునకే శిక్ష.
కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ప్రాణానికి ప్రాణము అనుట పాత నిబంధన యొక్క ఉపదేశము. అయితే నీ కుడి చెంపపై కొట్టుచున్నవానికి ఎడమచ్చంపను కూడా చూపించుము అనుట క్రొత్త నిబంధన ఉపదేశము. ఇది ఎంతటి కఠినమైనది! యేసు కఠినమైన ఉపదేశమును ప్రసంగించినప్పుడు, ఆయన యొక్క శిష్యులలో అనేకులు ఆయనతో నడవక వెనకంజ వేసిరి అని యోహాను. 6:66 లో చదువుచున్నాము.
అపో. పౌలు యొక్క పరిచర్యలో కఠినమైన పోరాటములును, సమస్యలును వచ్చెను. అయినను ఆయన: “క్రీస్తు యొక్క ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? …. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను” అని వ్రాయుచున్నాడు (రోమీ. 8:35,39).
దేవుని బిడ్డలారా, నిజముగా ప్రభువును ప్రేమించుచున్నవారికి ఆయన యొక్క ప్రేమను బట్టి ఏదియును కఠినమైనదిగా అనిపించదు. ఎట్టి కఠినమైనను ఆయన యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు.
నేటి ధ్యానమునకై: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది; దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు” (మత్తయి. 7:13).