No products in the cart.
నవంబర్ 25 – ప్రభువువలన మెప్పు!
“ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు” (2. కోరింథీ. 10:18).
లోకము మెప్పు కొరకు తపించుచున్నది. రాజకీయ నాయకులు తమ యొక్క మెప్పు కొరకు ఎంతకైనను ధనమును ఖర్చు పెట్ఠుచున్నారు. స్వప్రచారమును వెతుకుచున్నారు. తమ్మును గూర్చిన వార్తలు వార్తాపత్రికలయందును, దృశ్య మాధ్యములయందును వచ్చుచూనే ఉండవలెను అని కాంక్షించుచున్నారు.
వీధులలో తమ యొక్క పటములను, పెద్ద పెద్ద జండాలను పెట్టుటతో పాటు, కూలీకి బంటులను పెట్టుకుని తమ్మును పొగుడుటకు ఏర్పాటు చేయుచున్నారు.
కొరింథీ సంఘము ఎదిగి వచ్చినప్పుడు, ఆత్మీయ వరములు అక్కడ పనిచేయుటకు ప్రారంభించెను. సమస్త తలాంతులతోను, కృపలతోను, వరములతోను నిండిన సంఘముగా ఆ సంఘముండెను. ప్రభువు యొక్క వరముల కొరకు తన్ను తాను సమర్పించుకొనిన సంఘముగాను ఉండెను. అయినను అట్టి సంఘమునందు అనేకమంది తమ్మును తాము మెచ్చుకొనుచు, తమ్మును తాము పొగడుకొనుచు అతిశయించుటను చూచి, అపో. పౌలు, “తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు” అని చెప్పెను.
ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు కొండమీద ప్రసంగమును చేయుచున్నప్పుడు, “మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి” అని చెప్పెను (లూకా. 6:26).
మన యొక్క మార్గములను జీవితమును దేవుడు తన త్రాసులో తూచి చూచినప్పుడు కొదవ కలిగియున్నట్లయితే దానిని చూపించుచున్నాడు. మెండుగా ఉండినట్లయితే కొనియాడుటకు వెనకాడడు. బబులోను రాజైన బెల్షస్సరు యొక్క జీవితమును చర్యలను దేవుని యొక్క త్రాసు తూచి చూచెను. “మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్” అని ప్రభువు వ్రాసేను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అని అర్థము. ఆ కొదువను బట్టి దేవుని యొక్క న్యాయ తీర్పు అతనిపై వచ్చెను. ఆ రాత్రియందే అతడు హత్య చేయబడెను.
అదే సమయములో, ప్రభువునకు ప్రీతికరముగా నడుచుకొనుచున్నప్పుడు ప్రభువు ఆ సంగతిని గమనించి, వెన్ను తట్టి ఉత్సాహపరచి మెచ్చుకొనును. “ప్రభువు మెచ్చుకునువాడే యోగ్యుడు” (2. కొరింథీ. 10:18).
ప్రభువు నోవాహును మెచ్చుకొని చెప్పెను, “ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతి మంతుడవైయుండుట చూచితిని” (ఆది.కా. 7:1). మెచ్చుకొనుట మాత్రము గాక, జలప్రళయము నుండి నోవాహును కాపాడుటకై, నోవాహునుకు తగిన ఆలోచనను ఇచ్చెను. ఆ రీతిగా ఆ ఓడలో నోవాహును, అతని కుటుంబమును కాపాడబడిరి.
నోవాహు అంతగా ప్రభువుచే మెచ్చుకొనబడుటకు గల కారణము ఏమిటి? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నోవహు తన తరమువారిలో నీతిపరుడును, నిందా రహితుడునైయుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు” (ఆది.కా. 6:9). దేవుని బిడ్డలారా, మీరు దేవునితో నడచుచున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో అత్యధిక సమయము ప్రార్థనలో నిలిచియున్నప్పుడు, నీతిమంతుడిగాను, నిందారహితుడిగాను ఉందురు.
నేటి ధ్యానమునకై: “యోగ్యులమని దేవుని వలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము” (1. థెస్స. 2:4).