No products in the cart.
అక్టోబరు 04 – మెల్కీసెదెకు!
“మరియు, షాలేము రాజైయున్న మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు” (ఆది.కా. 14:18).
నేడు మనము దర్శించబోవుచున్నవాడు, యాజకుడును, రాజునైయుండి, అబ్రహామును ఎదుర్కొని వచ్చినవాడైన మెల్కీసెదెకు అనువాడైయున్నాడు. ఈయన ఎవరు, ఎలా వచ్చాడు, ఈయన యొక్క పూర్వీకత ఏమిటి, అను సంగతంతయును గొప్ప ప్రశ్నార్ధకముగానే ఉన్నది. ఈయన దేవుని కుమారునకు పోల్చబడినవాడును, దినములు యొక్క ప్రారంభమును, జీవితదినముల యొక్క ముగింపును లేనివాడుగాను, తల్లియు, తండ్రియు, వంశావళి లేనివాడుగాను జీవించినవాడు.
మొట్టమొదటిగా మెల్కీసెదెకును ఆదికాండ గ్రంథమునందు ఒక పరిచారకుని వలే చూచుచున్నాము. విజయమును పొంది వచ్చిన అబ్రహామునకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చి ఆయన యొక్క బడలికను తీర్చి, అబ్రహామును ఈయన ఓదార్చి ఆదరించుటను చూచుచున్నాము (ఆది.కా. 14:18-20).
కీర్తన గ్రంథమునందు, మెల్కీసెదెకును, ప్రభువు యొక్క యుద్ధసన్నాహ దినమునందు, మహిమగల కార్యములను చేయుచున్నవాడిగా చూచుచున్నాము (కీర్తనలు. 110:3). హెబ్రీ పత్రికయందు, ఈయనను ప్రధాన యాజకుడిగాను, క్రీస్తునకు పోలినవాడుగాను చూచుచున్నాము (హెబ్రీ. 7:1-17).
అబ్రహామును ఎదుర్కొని వచ్చిన మెల్కీసెదెకు, సర్వోన్నతుని యొక్క రాయబారిగా నిలబడెను. అబ్రహాము రాజులను ఓడించి వచ్చినట్లుగానే, మీరును లోకము, శరీరము, సాతాను అను శత్రువులను ఓడించి, ప్రభువు యొక్క రాకడయందు కొనిపోబడవలెను. అప్పుడు జెయించిన క్రీస్తు తానే మనలను ఎదుర్కొని వచ్చును (1. థెస్స. 4:16).
బైబిలు గ్రంథమునందు ఆది.కా. 14:18 లోనే మొట్టమొదటి సారిగా, “సర్వోన్నతుడగు దేవుడు” అను పదము వాడబడియున్నది (ఆది.కా. 14:18). దేవుడు అబ్రహామును కనానునకు పిలచున్నప్పుడు, “మహిమగల దేవుడు” అనియు. (అపో. కా. 7:2), అబ్రహామునకు తొంబదితొమ్మిది యేండ్ల వయస్సుయైనప్పుడు, దేవుడు తనను “సర్వశక్తిగల దేవుడు” అనియు (ఆది.కా. 17:1) బయలుపరచెను.
బైబిలు గ్రంథమునందు, సర్వోనతుడైన దేవుడు అను పదము, ఇంకా పలు సందర్భములయందు చోటుచేసుకుని ఉన్నది. “సర్వో(మహో)న్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు” (కీర్తనలు. 91:1). “ఆయన క్రీస్తునందు (పరలోకవిషయములలో) ఉన్నతమునందు గల ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఉన్నత(పరలోక)మునందు (ఆయనను) క్రీస్తును తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు” (ఎఫెసీ. 1:3,21). “క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, ఉన్నత(పరలోక)మందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను” (ఎఫెసీ. 2:7).
సర్వోన్నతుడగు దేవుని యాజకుడైయున్న మెల్కీసెదెకు ఓడిపోయిన లోతును, రాజులను ఎదుర్కొని రాలేదు. జెయమును పొందిన అబ్రహామునే ఎదుర్కొని వచ్చెను. ప్రకటన గ్రంథము అంతయును, “జెయించువాడు ఎవడో” అను పదము తొమ్మిది సార్లు చోటుచేసుకుని ఉన్నది.
“లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను” అని యేసు చెప్పెను కదా? దేవుని బిడ్డలారా, లోకమును జయించిన యేసుని నామమునందు, మీరును జెయించుడి.
నేటి ధ్యానమునకై: “జయించువాడు (వీటిని) సమస్తమును స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడైయుండును” (ప్రకటన. 21:7).