No products in the cart.
మార్చి 05 – భయపడకుడి!
“యేసు వారిని చూచి: భయపడకుడి; …. అనెను” (మత్తయి. 28:10).
ప్రియమైన అనుదిన మన్నా కుటుంబ సభ్యులకు, ప్రభువైన యేసుక్రీస్తుని మధుర నామమునందు నా యొక్క ప్రేమ పూర్వకమైన పునరుత్థానపు దినము యొక్క శుభాకాంక్షలను మీకు నేను తెలియజేయుచున్నాను.
యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినములయందు అనేక ప్రసంగములను చేసెను. అనేక ఆదరణకరమైన మాటలను చెప్పెను. పలుసార్లు శిష్యులను, విశ్వాసులను చూచి: ‘భయపడకుడి’ అని ప్రభువైన యేసు చెప్పియుండినప్పటికీని, తాను పునరుత్థానుడైన తరువాత తన యొక్క శిష్యులను చూచి: ‘భయపడకుడి’ అని చెప్పిన మాటకు ప్రత్యేకమైన శక్తియు ఆదరణయు కలదు.
పునరుత్థానుడైన యేసును తేరి చూడుడి. ఆయన ఒక్కడే మరణమును జయించి, పాతాళమును ఓడించినవాడు. ఆయన ఒక్కడే శత్రువు యొక్క తలను చితక కొట్టినవాడు. ఆయన ‘భయపడకుడి’ అని చెప్పుచున్నప్పుడు మరణమునకును, పాతాళమునకును, సాతానునకును మనము భయపడవలసిన అవసరము లేదు.
లోకమునందుగల అధికారులే గాని, నాయకులే గాని, ‘భయపడకుడి’ అని చెప్పుచున్నప్పుడు అట్టి మాట యొక్క భరోసా చాలా తక్కువైయుండును. వారు లోక ప్రకారమైన భయములో నుండి మాత్రమే కొంతవరకు విడిపించగలరు. అయితే సాతాను వద్దనుండి గాని, పాతాళము నుండి గాని, మరణము యొక్క బలము బారి నుండి గాని మనుష్యుని వారు తప్పించలేరు.
‘భయపడకుడి’ అని చెప్పుచున్న పునరుద్దానుడైన రక్షకుడి వైపు తేరి చూడుడి. ఆయన ఒక యోధుడు గాను, దళపతి గాను కనబడుచున్నాడు. రాజాది రాజుగాను, పరలోకమునందును, భూమియందును సకల అధికారము గలవాడిగాను నిలబడి: ‘భయపడకుడి’ అని చెప్పుచున్నాడు. అవును, అట్టి గొప్ప అధికారమునందును, బలగమునందును ఉన్నవారు మాత్రమే ‘భయపడకుడి’ అని మానవ జాతిని ఓదార్చ గలరు.
ఏ మనుష్యుడైయితే దేవుని యొక్క ప్రసన్నతను గ్రహింప కుండునో అతడే భయపడుచుండును. ఏ మనుషుడైతే పరుస్థుతులను దేవుడు లేకుండా ఎదుర్కొన లేక పోవుచున్నాడో అతడే భయపడుచు ఉండును. శిష్యులు కూడా అలాగుననే భయపడిరి. యేసు క్రీస్తు సిలువ వేయబడి, మరణించుటతో సమస్తమును ముగించబడెను అని తలంచిరి. తాము వెంబడించుచున్న రక్షకుడు ఎవరు అన్న సంగతిని ఎరగనందున వారు కలవరపడి తొందరపడిరి. అయితే, యేసు వారి చెంతకు వచ్చి, పునరుత్థానుడైన వాడిగా నిలబడి: ‘భయపడకుడి’ అని చెప్పుచున్నాడు.
మునుపైయితే యేసు శరీరమునందు ఉండెను, శరీరమునందు మనుగడను సాగించిన యేసు వలన ఒక్క సమయమునందు ఒక్క స్థలమునందే ఉండగలిగెను. అయితే ఇప్పుడు ఆయన పునరుద్దానుడైనందున ఆత్మగా అనేక స్థలములయందు ఒకే సమయములో ఉండగలడు. ఒకే సమయమునందు లోకమునందుగల వారందరిని ఆదరించగలడు. పగలే గాని, రాత్రే గాని అన్ని సమయములయందును మనలను ఓదార్చగలడు. దేవుని బిడ్డలారా, తిరిగి సజీవముగా లేచిన ప్రభువు మీతోకూడ ఉండుటచేత భయము లేకుండా, సంతోషముతో ఉందురు గాక.
నేటి ధ్యానమునకై: “భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను; మృతుడనైతిని, గాని, ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను” (ప్రకటన. 1:17,18).
