No products in the cart.
మార్చి 29 – ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు!
“ప్రేమ …. స్వప్రయోజనమును విచారించుకొనదు” (1. కొరింథీ. 13:5).
ఒక స్వార్ధపరుడు ఎల్లప్పుడును తన హక్కుల కొరకు పోరాడుచుండును. ప్రేమ గలవారైతే, తమ హక్కులను కూడా ఆప్యాయత కొరకు విడిచిపెట్టి త్యాగము చేయుదురు. ప్రేమ ఎన్నడును స్వప్రయోజనమును విచారించుకొనదు.
అబ్రహామును ప్రభువు పిలిచినప్పుడు, ఆయన సమస్తమును త్యాగము చేసి, తన స్వజనమును, తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టుటకు గల కారణము ప్రభువు పై ఆయనకు ఉన్న ప్రేమ, అత్యధికముగా ఉండుట చేతనే (ఆది.కా. 12:1).
యోనాతాను యొక్క జీవితమును ధ్యానించి చూడుడి. తన తండ్రియైన సౌలునకు తరువాత అతడే ఇశ్రాయేలీయులకు రాజుగా రావలసిన పరిస్థితి ఉండినప్పటికీని దావీదు పై ఉన్న ప్రేమ చేత తన వస్త్రమును, తన ఖడ్గమును, తన విల్లును, తన నడికట్టును అను సమస్తమును ఇచ్చివేసెను (1. సమూ. 18:4). అట్టి ప్రేమ స్వప్రయోజనమును విచారించని త్యాగపూరితమైన ప్రేమ.
“నేను కూడను నా స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెను అని, వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను; మీరు కూడాను యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి” (1. కోరింథీ. 10:32,33) అని తనను ఆదర్శవంతముగా ఉంచి, అపో. పౌలు వ్రాయుచున్నాడు. “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” (ఫిలిప్పీ. 2:4,5).
మనలను ప్రేమించుచున్న వారిని ప్రేమించుట సులువు. మనలను ప్రేమించని వారిని ప్రేమించుటయే కఠినము. అయితే పూర్తిగా శత్రులైయున్న వారిని ప్రేమించుట ఎలా? అది దైవీక స్వభావము. ప్రభువు “మీ శత్రువులను ప్రేమించుడి” అని వట్టిగా ఆజ్ఞాపించి ఉండిపోలేదు, తన జీవితమునందు శత్రువులను ప్రేమించి చూపిచెను.
సిలువలో కొట్టబడినప్పుడు ఆయన శత్రువులు ఆయనకు ఎంతగానో విరోధముగా లేచిరి! ఎంతగా ఆయనను శ్రమపరచి, అవమానపరిచిరి! ఆయన వారందరిని సహనముతో సహించుట మాత్రము గాక ప్రేమతో కూడాను తండ్రి తట్టున చూసి: ‘తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి’ అని గోజాడెను కదా. అదియే శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీ శత్రువు ఆకలిగొనియుంటే, అతనికి భోజనము పెట్టుము, అతడు దప్పిగొనియుంటే అతనికి దాహమిమ్ము; నీవు ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” (రోమీ. 12:20,21).
“నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల, అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను” (నిర్గమ. 23:4). దేవుని బిడ్డలారా, ప్రేమ సుప్రయోజనమును విచారించుకొనదు.
నేటి ధ్యానమునకై: “నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము; వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి, అసహ్యించుకొని వాని మీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో” (సామెతలు. 24:17,18).
