Appam, Appam - Telugu

జనవరి 14 – హృదయమును స్థిరపరచును!

“యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము; ఆయన నీ హృదయమును స్థిరపరచును; ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము” (కీర్తనలు. 27:14).

ఏపుగా ఎత్తునకు పెరుగుతున్న వృక్షములు స్థిరముగా ఉండుటకు దాని మొదలవేర్లు లోతుగాను, దృఢముగా ఉండుట అవశ్యము. అదేవిధముగా, ఆత్మీయ జీవితమునందును స్థిరపరచబడుటకు ప్రభువుతో లోతైన ప్రార్థనా జీవితము అవసరమైయున్నది.

కొంతమంది ముఫ్ఫై సంవత్సరములు క్రైస్తవులుగా ఉంటారు. అయితే చిన్న ఉపద్రవము వచ్చినను ప్రభువును‌ తృణీకరించి వేయుదురు. ప్రతిసారియు దైవ సేవకులు వచ్చి వాగ్దానపు వచనమును ఇచ్చి, వారిని ఉత్సాహపరిచి, మరలా ప్రభువులోనికి తీసుకొని రావలసినదై ఉండును.

యుద్ధమునందు స్థిరమైన మనస్సు లేకుండినట్లయితే, అతడు పిరికివానివలె వెన్నును చూపించి పారిపోవును. చదువులలో స్థిరత్వము లేనివాడు ఓటమినే తలంచి పరీక్షను రాయకుండానే మానివేయును. ఎట్టి అంశమునకైనను స్థిరమైన మనస్సు అవసరము.

అపో. పేతురు విశ్వాసులకు ఈ విధముగా వ్రాయిచున్నాడు: “తన నిత్య మహిమకు క్రీస్తుయేసునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి, స్థిరపరచి, బలపరచి, నిలబెట్టునుగాక” (1. పేతురు. 5:10).

శరీరమును స్థిరపరచుటకు వైద్యులు సత్తువగల మందులను వ్రాసి ఇచ్చుచున్నారు. శరీర వ్యాయామమును చేయునట్లు చెప్ఫుచున్నారు. అయితే వీటి కంటే హృదయమును స్థిరపరచుటయే అవసరము. అది జమ్మువలె అటు ఇటు కదులుచూ ఉండకూడదు. అపో. పౌలు వ్రాయుచున్నాడు: “నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. … , కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది” (హెబ్రీ. 13:9).

ఒకవైపు ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండుట హృదయమును స్థిరపరచును. మరోవైపున ప్రభువు యొక్క కృప హృదయమును స్థిరపరచుచున్నది. దేవుని బిడ్డలు తమ్మును దేవుడు స్థిరపరచుటకు సమర్పించు కొనవలెను. దానికి ఓర్పు చాలా చాలా అవసరము.

తొందరపాటు గల ఈ లోకములో ప్రభువు కొరకు దీర్ఘశాంతముతో కనిపెట్టుకొని యుండుట కొద్దిగ కఠినమైన అంశమైయున్నది. ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండని వారు తమకు ఉద్యోగము లభించదా, తమ యొక్క పిల్లలకు వైద్య కళాశాలయందు చోటు దొరకదా అని రాజకీయ నాయకుల వెనక వెళ్లి కనిపెట్టుకొనియుండి, సోమ్మసిల్లిపోయి ఉన్నారు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుటకు వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

అయితే దావీదును చూడుడి. ఆయన యొక్క హృదయము ప్రభువునందు స్థిరపరచబడి ఉన్నది. ఆయన చెప్పుచున్నాడు: “యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని; ఆయన నాకు చెవియొగ్గి, నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను, తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను” (కీర్తనలు. 40:1-3).

దేవుని బిడ్డలారా, “ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి” (యాకోబు. 5:8).

నేటి ధ్యానమునకై: “నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు; నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు; భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరాదు” (యెషయా. 54:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.