No products in the cart.
జూన్ 20 – భయమును బాపు హస్తములు
“వారి యెదుట రూపాంతరము పొందెను… శిష్యులు …. బోర్లబడి మిక్కిలి భయపడగా, యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను” (మత్తయి. 17:1,6,7)
ఒకసారి యేసుక్రీస్తు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని ఏకాంతముగా ఉండునట్లు యెత్తయిన యొక కొండమీదికి పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను అనియు; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను (మత్తయి. 17:1,2) అనియు బైబిలు గ్రంథమునందు చదువుచున్నాము.
శిష్యులు అ రూపాంతరపు కొండ యొక్క దర్శనము చూచిరి. ఏలియాను మోషేను చూచిరి. ప్రకాశవంతమైన మేఘము ఒకటి వారిని కమ్ముకొనుటను చూచిరి. శిష్యులు దానిని చూచి బోర్లబడి మిక్కిలి భయపడిరి. యేసు యొక్క ప్రేమగల హస్తములు, భయపడి నేలపై పడియున్న వారిని ముట్టెను. ‘లేవండి భయపడకుడని’ చెప్పెను.
అవును, యేసుక్రీస్తు యొక్క హస్తము భయమును బాపు ఔషధమైయున్నది. ఆయన యొక్క హస్తము ముట్టుచున్నప్పుడు మీ యొక్క భయములు అన్నియు ఎగిరి పారిపోవును. ఆయన యొక్క హస్తమే మిమ్ములను దృఢపరచి బలపరచదగినది.
పాత నిబంధనయందు, దానియేలు వెలవలబోయినప్పుడు, దేవుని దూత వచ్చి తన హస్తముతో ముట్టి దానియేలును దృఢపరచెను. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “అతడు నాతో మాట లాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను…” (దానియేలు. 8:18). దేవుని దూత కంటే గొప్ప హస్తమును, శక్తి గల హస్తమును యేసు క్రీస్తు యొక్క హస్తములు.
శిష్యులు మేడగది యందు తమ్మును, మరుగుపరుచుకుని కలతచెంది భయపడి నిలబడినప్పుడు, ఆయన తన యొక్క చేతులను పాదములను చూపించి వారిని దృఢపరచెను. రూపాంతరపు కొండయందైతే వారిని తన యొక్క స్వహస్తాలతో ముట్టి భయపడకుడి అని చెప్పెను.
మరొక సంఘటన కూడా ప్రకటన గ్రంథమునందు మనము చదువుచున్నాము. పత్మాసు ద్వీపమందు అపోస్తులుడైన యోహాను, ఆత్మవస్తుడైనప్పుడు క్రీస్తు యొక్క మహిమగల పోలికను చూచెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
అట్టి దర్శనము గూర్చి అపోస్తుడైన యోహాను, “నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని; ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి, నాతో భయపడకుము: నేను మొదటివాడను, కడపటివాడను జీవించువాడనైయున్నాను” (ప్రకటన. 1:17) అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, మీ రోగముల నుండియు, వేదనల నుండియు మిమ్ములను విడిపించుటకు ప్రభువు ఆసక్తితో ఉన్నాడు. ఆనాడు శిష్యులయొక్క భయమును బాపిన హస్తము, మీ యొక్క సమస్త భయములను బాపి, మిమ్ములను దృఢపరచునట్లుగా చాపబడి ఉన్నది. విశ్వాసముతో అట్టి హస్తమును పట్టుకొనుడి.
నేటి ధ్యానమునకై: 📖”దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని, పిరికితనముగల ఆత్మ నియ్యలేదు” (2. తిమోతికి 1:7).