No products in the cart.
మార్చి 20 – సిలువ ద్వారా విజయము!
“ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను” (కొలస్సీ. 2:15)
యేసు మోసిన సిలువ కలదు. సహించిన సిలువ కలదు. అదే సమయమునందు జయము పొందిన సిలువను కలదు. ఈ సంగతిని మీరు అర్థవంతముగా ధ్యానించుచున్నప్పుడు, క్రీస్తు శిలువపై విజయము పొందిన దానిని మీ సొంతము చేసుకొందురు. విజయమును స్వతంత్రించుకొందురు. తలను ఎత్తుకొని సంతోషముతో జీవించెదరు.
యేసు మోసిన సిలువ ఏది? “వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు” అనియు (యోహాను. 19:17). అట్టి సిలువ మ్రానుపై మన యొక్క పాపములను భరించెను అనియు (యెషయా. 53:12). దోషములను భరించెను అనియు (యెషయా. 53:11). మన యొక్క బలహీనతలను వహించుకొని, మన యొక్క రోగములను భరించెను అనియు (మత్తయి. 8:17). శ్రమలను, వ్యసనములను భరించెను అనియు (యెషయా. 53:4). శాపములను భరించెను అనియు (గలతి. 3:13). అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.
యేసుక్రీస్తు సహించిన సిలువ ఏది? బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు”. (హెబ్రీ. 12:2). ‘సిలువ’. అంటే, అది సహించలేని వేదనయు, అవమానమును, సిగ్గును, దుఃఖమును బయలు పరచుచున్నది.
నేడు జనులు తమకు ఏర్పడుచున్న వేదనలను, అవమానములను సహించలేక ఆత్మహత్యను చేసుకొనుచున్నారు. అయితే యేసు, మనపై ఉంచిన ప్రేమచేత ప్రతి ఒక్క వేదనను కల్వరి శిలువయందు అణువణువునా సహించెను. అవమానములను, నిందలను ఆనందముగా వహించెను.
మూడోవదిగా, జయము పొందిన సిలువను గూర్చి కొలస్సీ. 2:15 ‘వ వచనమునందు , అనగా నేటి ధ్యానపు ప్రారంభమునందు ఇవ్వబడియున్న వచనమునందు మనము చదివియున్నాము. సిలువ మార్గమునందు ఆయన ఒక పిరికివానివలె కాక, జయము పొందిన యోధునివలె నడిచి జయము పొందెను. లోకమును, శరీరమును జయించెను. సాతాను యొక్క శిరస్సును చితకగొట్టి జయమును పొందెను.
కల్వరి సిలువయందు యేసు క్రీస్తు సాతాను యొక్క సర్వశక్తులను నశింపజేసి, జయము పొందెను. మనకు అట్టి జయమును దయచేసియున్నాడు.
అపోస్తులుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు, “క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు, ప్రతి స్థలమందును మా ద్వారా అయనను గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము” (2 కోరింథీ. 2:14). “మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము” (1. కోరింథీ. 15:57).
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కల్వరి సిలువను వహించి, ఘోరమైన శ్రమల ద్వారా వెళ్లినందున మనకు లభించుచున్న సమస్త ఆశీర్వాదములను జయములను స్వతంత్రించుకొనుడి.
నేటి ధ్యానమునకై: 📖”మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” (ప్రకటన. 1:18).
