Appam, Appam - Telugu

మార్చి 17 – ప్రేమతో ఏర్పరచుకొనెను!

“నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను” (ద్వితి. 7:6).

ప్రభువు మిమ్ములను తన కొరకు ఏర్పరచుకొనియున్నాడు. స్వకీయజనముగా ఏర్పరచుకొనియున్నాడు! శ్రీకృత దత్తపుత్రునిగా ఉండునట్లు ఏర్పరచుకొనియున్నాడు. తన యొక్క మహిమను మీకు విభజించి ఇచ్చునట్లుగా ఏర్పరచుకొనియున్నాడు. నిత్యా నిత్యముగా ఆయనతో జీవించునట్లుగా ఏర్పరచుకొనియున్నాడు.

ఆయన ఎలాగున ఏర్పరచుకొనెను? ‘ప్రేమతో ఆయన ఏర్పరచుకొనెను!” అని బైబిలు గ్రంథము ఒకే పంక్తులో చెప్పుచున్నది. ప్రభువు మిమ్ములను ప్రేమించుటచేతను, మీ పితరులకు చేసిన ప్రమాణమును కాపాడవలెను అనుట కొరకును ఏర్పరచుకొనెను అని ద్వితీయోపదేశకాండము 7:8 ‘వ వచనమునందు చదువుచున్నాము.

అవును, ఆయన ప్రేమించి ఏర్పరచుకొనెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మనలను ప్రేమించుచు, తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించి, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసిన ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌” (ప్రకటన. 1:6). అట్టి ప్రేమ ఎంతటి ఔన్నత్యమైన ప్రేమ!

ప్రభువు మీ యొక్క అర్హతను చూచి గాని, గుణాతిశయములను చూచి గాని మిమ్ములను ఏర్పరచుకొనలేదు. మిమ్ములను ప్రేమించినందున ఆయన మిమ్ములను ఏర్పరచుకొనెను. “నేను మీయెడల ప్రేమ చూపియున్నాను” (మలాకీ. 1:2). “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను” (యిర్మీయా. 31:3) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ప్రభువు మీ యొక్క సత్క్రియలను చూచి గాని, దానధర్మములను చూచి గాని మిమ్ములను ఏర్పరచుకొనలేదు. తన యొక్క ప్రేమను బట్టి కృపను బట్టియే ఏర్పరచుకొనెను. ఆయన యొక్క కృప ఎంతటి మధురమైనది! కృప అను మాటకు, “అర్హత లేని వారిపై క్రీస్తు చూపించిన దేవుని దయ” అనుట అర్థము కదా?

ప్రేమ చేతను, కృప చేతను మాత్రమే గాక, తండ్రి యొక్క భవిష్యద్‌ జ్ఞానమునుబట్టియే ప్రభువు మిమ్ములను ఏర్పరచుకొనెను. “తండ్రియైన దేవుని భవిష్యద్‌ జ్ఞానమును బట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన,…. యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది” (1. పేతురు. 1:1,2) అని అపో. పేతురు వ్రాయుచున్నాడు.

ఈ వచనమును కాస్త లోతుగా ధ్యానించి చూచుచున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మిమ్ములను భవిష్యద్ జ్ఞానమును బట్టియే ఏర్పరచుకొనెను అను సంగతిని తెలుసుకొనగలము. అట్టి భవిష్యద్ జ్ఞానమును బట్టి ఫలానా వారు ఫలానా వారిని తమ యొక్క రాజ్యమునకు ఏర్పరచుకొనవలెను అని ఆదిలోనే తండ్రి నిర్ణయించుకొని ఉండెను.

జనములో ఒకరిని, గోత్రములో ఒకరిని, పట్టణములో ఒకరిని అని పలు రకాల పరుస్థుతులయందు ఉన్న మిమ్ములను తన యొక్క భవిష్యద్ జ్ఞానమును బట్టి ఏర్పరచుకొనెను. దేవుని బిడ్డలారా, మిమ్ములను గూర్చి ప్రభువు ముందుగానే ఎరిగియుండెను.

నేటి ధ్యానమునకై: “ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?” (యాకోబు. 2:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.