No products in the cart.
మార్చి 05 – కప్పుచున్న ప్రేమ!
“ప్రేమ అనేక పాపములను కప్పును” (1. పేతురు. 4:8).
మహావీరుడైన అలెగ్జాండరు యొక్క ఆస్థానమునందు బహు పేరు గాంచిన చిత్రకారుడు ఒకడు ఉండెను. అతడు చక్రవర్తిపై అమితమైన ప్రేమను కలిగియుండెను. అతడు పలు సంవత్సరములు ప్రయత్నించి చక్రవర్తి యొక్క చిత్రపటము ఒకటి గీసెను. చక్రవర్తి యొక్క ముఖమునందు గాయముచే ఏర్పడిన ఒక దెబ్బ ఆ చిత్రము యొక్క అందమును కాస్త తగ్గించెను. కావున అతడు మరల రాత్రింబగళ్లు శ్రమించి ఆ దెబ్బ తెలియకుండా ఉండుటకు చక్రవర్తి తన యొక్క చెయ్యిని చెక్కిళ్లపై ఉంచుకొని దీర్ఘమైన ఆలోచనలో ఉండునట్లు మార్చి బహు చక్కగా చిత్రమును గీసి ముగించెను.
అలెగ్జాండరు ఆ చిత్రము యొక్క అందము చూచి బహుగా సంతోషించెను. తన చెక్కిళ్లపై ఉన్న దెబ్బ చిత్రమునందు కనబడక పోవుటను గూర్చి అడిగినప్పుడు ఆ చిత్రకారుడు: “రాజా, ఆ దెబ్బను నా ప్రేమ కప్పివేసేను” అని జవాబును ఇచ్చెను. అవును, ప్రేమ అనునది అనేక దెబ్బలను, విస్తారమైన పాపములను కప్పివేయును. అయితే ప్రేమ లేని వారైతే అన్నిటిలోను లోపమును కనిపెట్టుకొనుచు, సణుగుకొనుచు ఉందురు.
మీ హృదయమును క్రీస్తు యొక్క ప్రేమ చేత నింపివేయుడి. ఆయన యొక్క ప్రేమ ద్రోహులను సహితము క్షమించి అంగీకరించు దైవీక ప్రేమ కదా? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ప్రేమ దీర్ఘకాలము సహించును; దయ చూపించును; ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు” (1. కోరింథీ. 13:4).
ఎప్పుడైనా ఒకసారి మీయొక్క హృదయమునందు ఇతరులను గూర్చి ద్వేషమును, వైరాగ్యమును వచ్చుచుండుటను గ్రహించినప్పుడు, మీరు ప్రేమయందు క్షీణింప బడియున్నారు అన్న సంగతిని జ్ఞప్తి తెచ్చుకొనుడి. అట్టి సమయములయందు ఏకాంతమునందు ప్రభువు యొక్క సముఖమునకు పరిగెత్తుకుని వెళ్లి: “ప్రభువా నీ యొక్క ప్రేమను ఇంకను నా యొక్క హృదయమునందు కుమ్మరించుము; నాకు కీడు చేసిన వారిని సహితము ప్రేమించేటువంటి హృదయమును దయచేయుము” అని అడిగి గోజాడుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నందున అట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” (రోమీ. 5:5).
యేసు క్రీస్తు చెప్పెను: “నేను మీతో చెప్పుచున్న
దేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి; మిమ్మును శపించువారిని ఆశీర్వదించుడి; మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి; మిమ్మును నిందించువారి కొరకును, మిమ్మును హింసించువారి కొరకును ప్రార్థన చేయుడి. ఇలాగున చేయుట వలన పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుందురు ” (మత్తయి. 5:44). కల్వరి ప్రేమ చేత మనము నింపబడియున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము నడుచుకొనగలము.
యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు అదియే. సిలువలో వేలాడుచు ఉన్నప్పుడు కూడాను తనను హింసించుచున్న వారి కొరకు ఆయన ప్రార్థించెను. “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా.23:34) అని చెప్పి విజ్ఞాపన చేసెను.
దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క తప్పిదములను లోపములను ఎన్నడును గొప్ప చేయకుడి. మీ యొక్క కుటుంబమును దైవీక ప్రేమ ఏలుబడి చేయునుగాక.
నేటి ధ్యానమునకై: “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” (ఫిలిప్పీ. 2:5).
