No products in the cart.
ఫిబ్రవరి 28 – భుజమునందించుడి!
“ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయైయున్నాడు” (కీర్తనలు. 68:19).
మన ప్రియ ప్రభువు మన కొరకు సిలువను మోసెను. మనము కూడాను ఆయన అడుగుజాడలను వెంబడించి సిలువను మోయునట్లుగా పిలువబడియున్నాము. యేసుక్రీస్తు చెప్పెను: “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల అతడు తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను” (లూకా. 9:23).
మన భుజముపై ప్రభువు ప్రేమతో ఒక శిలువను పెట్టుచున్నాడు. అది ఆత్మల భారము అను సిలువ, గోజాడి ప్రార్ధించెటు వంటి సిలువ. మనము ప్రభువు యొక్క నామమునందు ఒకరి భారమును ఒకరు భరించునట్లుగా పిలువబడి ఉన్నాము. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను; తానును శోధింప బడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, ఒకని భారముల నొకడు భరించి, యీలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి” (గలతి. 6:1,2).
సిలువను మోయుటకు మనము మన భుజములను ఇచ్చేదమా? నశించిపోవుచున్న ఆత్మల కొరకును, దేశముల కొరకును, పరిచర్యల కొరకును మనము ప్రభువుతో కలసి భుజమును అందించి ప్రార్థించేదమా? ప్రభువు ప్రార్థన ఆత్మతోను, విజ్ఞాపన ఆత్మతోను మనలను నిశ్చయముగానే నింపును.
మనము ప్రభువు యొక్క పనికొరకును, పరిచర్య కొరకును భుజమును అందించవలెను కదా? ఎంతోమంది ప్రజలు ప్రార్థన విజ్ఞాపనలను మన యొక్క భుజములపై పెట్టుచున్నప్పుడు వారి యొక్క భారమును మన యొక్క భారముగా భావించి ప్రార్ధించవలెను కదా?
యిర్మియా ప్రవక్త ఎంతగా ఇశ్రాయేలీయుల యొక్క భారములను భరించెను! ఆయన రచించిన విలాపవాక్య గ్రంథమును చదువుతున్నప్పుడు ప్రభువు యొక్క భారమును తనపై వేసుకొని “ఆ!, కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక” (యిర్మీయా. 9:1) అని చెప్పి విలపించెను కదా?
బుజమును అందించుట అనుటకు మరొక అర్థము కలదు. అది ఏక మనస్సుతో నిలబడుటయైయున్నది. చేతులలో చెయ్యి వేసి జోడించి భుజముతో భుజమును అందించి నిలబడిరి అని చెప్పుట అలవాటు.
నెహెమ్యా ప్రభువు కొరకు యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టుటకు తలంచినప్పుడు అక్కడ నివసించుచున్న యూదులు అట్టి మంచి పని కొరకు తమ యొక్క భుజములను అందించిరి. నెహెమ్యా యొక్క చేతులను బలపరిచిరి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అందుకు వారు: మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి, యీ మంచికార్యము చేయుటకై తమ చేతులకు బలమును తెచ్చుకొనిరి” (నెహెమ్యా. 2:18).
దేవుని బిడ్డలారా, నమ్మకముగాను, యథార్థముగాను శ్రమ పడుచున్న వేలకొలది దేవుని యొక్క బిడ్డలతో నిలబడి వారి యొక్క పని కొరకు భుజమునందించుడి. మిషనరీ పరిచర్యల కొరకు భుజమునందించుడి. సువార్త పరిచర్యల కొరకు భుజమునందించుడి. మనము కలసిగట్టుగా ఏక మనస్సుతో నిలబడి, ప్రభువు యొక్క నామమును దేశమునందు హెచ్చించుదుము గాక!
నేటి ధ్యానమునకై: “ఉపకారమును, ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి” (హెబ్రీ. 13:16).
