Appam, Appam - Telugu

ఫిబ్రవరి 27 – ఊరకనే నిలిచియుండుడి!

“మీరు ఊరకనే నిలిచియుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి” (కీర్తనలు. 46:10).

మీరు, మీ హృదయము ఆవేశపడుచున్నప్పుడు, పలు విధములైన చింతల చేత పీడింప బడుచున్నప్పుడు, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కలవర పడుచున్నప్పుడు, ప్రభువు యొక్క పాదములయందు ఊరకనే కూర్చుండుడి. ఏమి మాట్లాడినను నేరము, ఏమి చేసినను నేరము అని నేరము కనుగొనుచున్న వారి మధ్యలో ఏమియు మాట్లాడక ఊరకనే కూర్చుండుడి.

మీరు ఊరకనే కూర్చుండునప్పుడు ప్రభువు మీ కొరకు వాదించి యుద్ధము చేయును. మీరు ఊరకనే కూర్చుండునప్పుడు ప్రభువు మీ కొరకు పౌరుషముతో లేచి నిలబడుటను చూచెదరు.

నేడు మీకు విరోధముగా ఒక తుఫాను వీచుచున్నదా? సముద్రము ఉప్పొంగుచున్నదా? మీయొక్క ప్రయత్నములు అన్నియును వ్యర్ధమని అనిపించుచున్నదా? మీరు ప్రభువు యొక్క సముఖమునందు ఊరకనే కూర్చుండుడి. అప్పుడు ప్రభువు లేచి నిలబడి, “శబ్దము చేయుక నిమ్మలముగా ఉండుము” అని చెప్పి తుఫానును, కడలిని గద్దించి నిమ్మలపరచును.

ఆనాడు గలిలయ సముద్రమునందు శిష్యులు ప్రయాణము చేయుచున్నప్పుడు వీచుచున్న తుఫానును, ఉప్పొంగుచున్న కడలిని అలాగునే నిమ్మలపరిచెను. 18 మైళ్ళ పొడవును, 13 మైళ్ళ వెడల్పును గల అట్టి సముద్రపు అలలు నిమ్మలముగా అణిగి పోయెను. తుఫాను నిమ్మలమై దైవీక ప్రశాంతత అక్కడ నెలకొల్పబడెను.

పలు పరిశుద్ధుల యొక్క అనుభవము అదియే. పరిచర్యకు విరోధముగా సమస్యలును, పోరాటములును వచ్చుచున్నప్పుడు, వారు ప్రశాంతముగా రెండు లేక మూడు దినములు ప్రభుతో గడుపునట్లుగా ఏకాంతమునందు వెళ్లిపోవుదురు. ప్రభువు యొక్క పాదములయందు పడి ప్రార్ధించుదురు. ప్రభువుకు మాత్రమే తమ యొక్క బాధలను, వేదనలను తెలియజేయుదురు. ఆ తరువాత వారు పక్షిరాజు వలె నూతన బలమును పొంది తిరిగి వచ్చుచున్నప్పుడు ప్రభువు తమ కొరకు సమస్తమును చేసి ముగించియుండుటను చూచెదరు.

తమ్మును తరుముచూ వెంబడించుచున్న ఐగుప్తు యొక్క వీరులు వచ్చుచున్నారే, రధములును, సైన్యములును వచ్చుచున్నవే, ఫరో ఏమి చేయునో అని ఇశ్రాయేలు ప్రజలు కలవరపడినప్పుడు మోషే చెప్పినది ఏమిటో తెలియునా? “భయపడకుడి; మీరు ఊరకనే నిలుచుండి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెను” (నిర్గమ. 14:13,14) అని మోషే చెప్పెను.

మీరు ఊరకనే ఉండవలెను అనుటకు గల అర్థము ఏమిటి? ఊరికనే కూర్చుందురు అనుటయే. అపో. పేతురు, ఊరకనే కూర్చుండుటతో పాటు అణిగియు ఉండుడి అని ఆలోచనను చెప్పుచున్నాడు. “కావున, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిలో దీనమనస్కులై అణిగియుండుడి” (1. పేతురు. 5:6).

దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడక ఊరకనే కూర్చుండు సమయము అనునది, దుర్మార్గులైన వారికి వచ్చుచున్న ప్రతిఫలమును చూచుచున్న ఒక సమయము. ప్రభువు బలమైన పరాక్రమ శూరుడుగా లేచుచున్న ఒక సమయము. అప్పుడు ప్రభువు యొక్క మహత్యమును, మహిమను మీరు చూచెదరు.

నేటి ధ్యానమునకై: “ఇదిగో, నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను” (యిర్మీయా. 30:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.