No products in the cart.
ఫిబ్రవరి 24 – మేలు చేయువాడు!
“ఆయన మేలు చేయుచుండువాడై, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను” (అపో.కా. 10:38).
మన ప్రియ ప్రభువు మంచివాడు. ఆయన మంచివాడై ఉండుట చేత మేలు చేయుచున్నాడు. ఆయన మేలు చేయుచున్నవాడై, అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచువాడై సంచరించుచుండెను అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. రెండు వేల సంవత్సరములకు పూర్వము మేలును చేయుచుండువాడై సంచరించుచుండినవాడు, నేడును మారనివాడై మీ చెంతకు వచ్చి మీకు మేలును చేయుటకు ఆసక్తిగలవాడై ఉన్నాడు.
కీడును చేయవలనని ఒకడు సంచరించుచున్నాడు, అతడే అపవాధియైన సాతాను. అతడు దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు. అయితే మంచివాడైయున్న క్రీస్తు మనకు జీవము కలుగుటకును అట్టి జీవము సమృధ్ధిగా కలుగుటకును వచ్చెను (యోహాను. 10:10).
మేలును చేయుచున్న యేసు కేవలము మేలును చేయుటతోపాటు ఆగిపోవటలేదు! కీడు చేయుచున్న సాతానును తరిమివేసి అతని యొక్క పిడిలోనుండి విడుదల చేయుచున్నాడు. ఆయన మేలును చేయుచున్నవాడై అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచువాడై సంచరించుచుండెను అని బైబిలు గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది (అపో.కా. 10:38).
ఒకసారి ఒక సహోదరి అతి భయంకరముగా వ్యాధి బారిన పడి వైధ్యశాలలో చేర్చబడియుండెను. ఐదు సంవత్సరములుగా ఆ వ్యాధి వారిని పట్టి పీడించుచుండెను. వైద్యుల వలన ఆ వ్యాధికి గల కారణమును కనుగొనలేక అల్లాడిపోయిరి. లక్షలు లక్షలుగా ధనము ఖర్చుపెట్టబడుచు ఉండెను.
ఒక దినమున ఆ వైద్యశాలకు ప్రభువు యొక్క ప్రేమను గూర్చి చెప్పుటకు ఒక సేవకుడు వచ్చెను. ఆ సహోదరి కళ్ళల్లో కన్నీటితో: “అయ్యా, ప్రభువు మంచివాడై ఉన్నట్లయితే ఎందుకని నాకు ఇట్టి వ్యాధి, ఎందుకని ఇట్టి మరణపు పోరాటము, ఎందుకని ఇట్టి అనవసరపు ఖర్చు” అని చెప్పి విలపించెను.
ఆ బోధకుడు యోహాను. 10:10 ‘లో కనబడుచున్న వచనమును తీసి చూపించి, ‘మీ యొక్క ఆరోగ్యమును అడ్డగించువాడు సాతాను. వాడు దొంగ; దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; అయితే ప్రభువైయున్న యేసు మీకు జీవము కలుగుటకును; అది సమృధ్ధిగా కలుగుటకును వచ్చెను’ అని చెప్పి వారి శిరస్సుపై చేయ్యి పెట్టి ప్రార్థించెను. అంతే! అందరు ఆశ్చర్యపడునట్లుగా, ఆమెలో ఉన్న అపవిత్రాత్మలు బయలుదేరి పారిపోయెను. ప్రభువు సాతాను యొక్క పిడిలోనుండి వారికి పరిపూర్ణమైన విడుదలను ఇచ్చెను. ఆనాడే ఆమె దైవిక స్వస్థతను పొందుకొనెను.
మంచివాడైయున్న క్రీస్తు సాతాను యొక్క సకల శక్తులపైన మీకు అధికారమును, ఏలుబడిని అనుగ్రహించియున్నాడు. అప్పుడు వాడు మిమ్ములను విడిచి పారిపోవును.
దేవుని బిడ్డలారా, మంచివాడును మేలును చేయుచుండు వాడైయున్న క్రీస్తును మీ యొక్క జీవితములోనికి ఆహ్వానించి స్తుతించుడి. అప్పుడు కీడులు తొలగి పోవును. ఆశీర్వాదములు కలుగును, మేలులు పెరుగును.
నేటి ధ్యానమునకై: “మరణము వారికి సంభవించినప్పటికిని, తప్పించుకొనుటకు తమ ప్రాణములను ప్రేమించిన వారుకారు గాని, వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు” (ప్రకటన. 12:11).
