No products in the cart.
ఫిబ్రవరి 17 – వెనకకు తీసినయెడల!
“నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని, అతడు వెనుకతీసిన యెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు” (హెబ్రీ. 10:38).
ఒకడు వెనక తీసిన యడల అతనిపై నా ప్రాణమునకు సంతోషము ఉండదు అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు కొరకు పలు శ్రమలను అనుభవించిన ఒక మిషనరీని నేను ఎరుగుదును. ఆయన ఒక విదేశీయుడైన ఒక్క క్రైస్తవ సేవకుడై యుండుటచేత, జనులు ఆయనను పలు రకములైన చిత్రవధకు గురిచేసి, యేసును తృణీకరించమని చెప్పి బలవంతము చేసిరి.
ప్రభువు అతనిని చూచి: “నీవు విశ్వాసమునందు దృడముగా నన్ను ఆనుకునుము. వెనకకు తీసినయెడల నీపై నా ప్రాణమునకు సంతోషము ఉండదు” అని చెప్పెను. ఆ భక్తుడు ప్రభువును దృఢముగా హత్తుకొని పట్టుకొనెను. ‘విశ్వాసము మూలముగా నీతిమంతుడు జీవించును అని చెప్పితివే ప్రభువా, నీపైనే విశ్వాసమును ఉంచియున్నాను. ఈ శోధనలో నేను పడిపోకూడదు’ అని దృఢముగా నిలబడెను.
ఆయన తన యొక్క చెర అనుభవములను పంచుకొనుచున్నప్పుడు, నా హృదయము ఆశ్చర్యపడెను. నేడు దేవుని విడిచి అనేకులు వెనకబడి పోవుచున్నారు. ఒక కాలమునందు ప్రభువు కొరకు ప్రకాశించిన వారు, నేడు పడిపోయిన స్థితిలో కనబడుచున్నారు. సొమ్మసిల్లిపోవుట చేత వెనుకబడిపోయిరి.
వెనకబడిపోయిన స్థితిలో ప్రభువు మిమ్ములను చూచుచున్నప్పుడు, పరితపించుచు, ‘నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది, కావున నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని, మారుమనస్సుపొంది, ఆ మొదటి క్రియలను చేయుము’ అని చెప్పెను (ప్రకటన. 2:4,5). మిమ్ములను కొద్దిగా పరిశీలించి చూచుకొనుడి. మొదట మీకు ఉండిన దైవీక ప్రేమ మీలో ఉన్నదా? మొదట మీరు ప్రభువు యొక్క సన్నిధిలో స్తుతించి ఆనందించినట్లు నేడును స్తుతించి ఆనందించుచున్నారా? వీధి సువార్తలకు వెళ్ళుటయును, ఆత్మలను దర్శించుటయును సంతోషకరమైన అనుభవముగా అనిపించుచున్నదా?
ఇట్టి ప్రశ్నలన్నిటికి మీ యొక్క జవాబు: ‘లేదు’ అనుట చేత మీరు వెనక పడిపోయిన స్థితిలో ఉన్నారు అనుటయే అర్థము. వెనకబడిపోయారు అనుటకు మరొక గుర్తు ఇతరులపై నేరములు మోపుటయే. సహోదరుల మీద నేరమును కనుగొనుటయే. ఏ మనుష్యుడైతే ప్రభువు యొక్క మహిమను మహత్యమును గూర్చి మాట్లాడక సహోదరులపై నేరము చెప్పుచు ఉన్నాడో, అతడు వెనకబడి పోవుటతో పాటు సాతానునికి చోటు ఇచ్చియున్నాడు అనుటయే అర్ధమునైయున్నది.
మీరు అట్టి పరిస్థితియందు ఉన్నట్లయితే కన్నీటితో మారుమనస్సు పొంది, ప్రభువు వద్దకు రండి. అనేకులు వెనకబడి పోవుటకు గల కారణము వారు క్రీస్తును తేరి చూడక వెనుకకు తిరిగి లోకము యొక్క అంశములను చూచుటయైయున్నది. నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని లూకా. 9:62 ‘లో చదువుచున్నాము.
ఇశ్రాయేలు ప్రజలు కనానునకు ప్రయాణము చేయుచున్నప్పుడు వారి యొక్క హృదయము ఐగుప్తునందుగల దోసకాయలను, వెల్లుల్లిపాయలను, చేపలను తలంచుకొనుచు ఉండుట చేత, వారు కనాను లోనికి వెళ్లలేకపోయిరి. దేవుని బిడ్డలారా, వెనకబడి పోవుకుండునట్లు జాగ్రత్తగా ఉండుడి.
నేటి ధ్యానమునకై: “భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును” (సామెతలు. 14:14).
