No products in the cart.
ఫిబ్రవరి 05 – ఆలోచన!
“అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను; నా కుడిచెయ్యి నీవు పట్టుకొని ఆదుకొనుచున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు,ఆ తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు” (కీర్తనలు. 73:23,24).
వ్యక్తిగత ప్రార్థన మనకు ఎందుకని అవశ్యము అను సంగతి తెలియునా? వ్యక్తిగత ప్రార్థన సమయములోనే మనము దేవుని యొక్క ఆలోచనలను పొందుకొనుచున్నాము. ఆయన మనపై తన యొక్క కన్నులను ఉంచి మనకు ఆలోచనను చెప్పుచున్నాడు.
మన ప్రభువు యొక్క పేరు ఆలోచనకర్త (యెషయా. 9:6) అనియు, ఆయన ఆలోచనలయందు ఆశ్చర్యకరుడు (యెషయా. 28:29) అనియు, యెహోవా యొక్క ఆలోచనలు సదాకాలము నిలుచును (కీర్తనలు.33:11) అనియు బైబులు గ్రంథము చెప్పుచున్నది.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆలోచనను పొందుకొనుటకు ప్రత్యేకమైన సమయమును కేటాయించుడి. మీరు ప్రార్ధించి ముగించిన వెంటనే ప్రభువు యొక్క మెల్లని స్వరము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఆయన మీకు ఆలోచనను అనుగ్రహించెదను అని వాక్కునిచ్చియున్నాడు కదా! బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది: “ఆలోచన లేని స్థలమునందు జనులు చెడిపోవుదురు” (సామెతలు. 11:14).
ప్రతి దినమును మనము పలు తీర్మాణములను నెరవేర్చవలసినదై ఉన్నది. పలు సమయములయందు మనము ఎక్కడికి వెళ్ళవలెను, ఈ త్రోవలో వెళ్ళవలెను, ఎటువంటి నిర్ణయముమును తీయవలెను, ఎవరిని వెళ్లి సంధించవలెను, అని మనకు తెలియక పరితపించుచు ఉంటాము. ఒక్క అడుగును పొరపాటుగా వేసినను దాని యొక్క వేదన నిశ్చయముగా అనుభవించవలసినది వచ్చును.
ప్రభువు మనకు ఆలోచన చెప్పుట కొరకే ఆలోచనను అనుగ్రహించు ఆత్మను ఉంచియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును” (యెషయా. 11:2).
అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మర్మములు మొదలుకొని సమస్తమును ఎరిగియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలు పరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు” (1. కోరింథీ. 2:10). దేవుడు మనకు ఆయన యొక్క ఆలోచనలను తన యొక్క ఆత్మ ద్వారా బయలు పరచుచున్నాడు.
మోషే ఐగుప్తులో నుండి కనాను దేశమునకు సుమారు 20 లక్షల మందిని అరణ్య మార్గము గుండా త్రోవ నడిపించెను. ప్రతి దినమును ఎక్కడ బస చేయవలెను, ఎక్కడ పాళెము దిగవలెను, ఎప్పుడు బయలుదేరవలెను, ప్రజలకు అవసరత గల సమయములో ఏమి చేయవలెను అనుటయందు దేవుడు తన యొక్క ఆలోచనను ఇచ్చెను.
దేవుని యొక్క ఆలోచనను వినిన మోషేకు ప్రభువు దానిని పరిపూర్ణముగా దయచేసి ఉండెను. మేఘస్తంభములు అగ్నిస్తంభముల ద్వారా బహు చక్కగా త్రోవ నడిపించెను (ద్వితీ. 1:32,33). అద్భుతములను చూడజేసెను. దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువు యొక్క ఆలోచనను అడుగుడి. ఆయన నిశ్చయముగానే మీకు ఆలోచనను ఇచ్చి త్రోవ నడిపించును.
నేటి ధ్యానమునకై: “నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను; రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది” (కీర్తనలు. 16:7).
