No products in the cart.
నవంబర్ 21 – నిద్రించుచున్నావా?
“మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి, గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు, గురుగులు కూడ అగపడెను” (మత్తయి. 13:25,26).
నిద్ర మంచిదే; ప్రభువు తనకి ఇష్టమైన వారికి నిద్రను ఇచ్చుచున్నాడు అను సంగతి వాస్తవమైనదే. అయితే అట్టి నిద్రలో సాతానుకు చోటు ఇచ్చి గురుగులను విత్తుటకు అతనికి అనుమతి నివ్వకూడదు!
‘మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి’ అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. శత్రువు మోసపుచ్చుట కొరకు ఎదురుచూచుచున్న ఒక సందర్భము మనుష్యుని యొక్క నిద్రయే. అది అంధకారపు సమయము. శత్రువు బలమును పుంజుకునేటువంటి ఒక సమయము.
దేవుని బిడ్డలు నిద్రించుచుండినను, అట్టి నిద్ర మేలుకువ గల ఒక నిద్రగా ఉండవలెను. ఆత్మలో మెలకువగలవారై ఉండుట మనకు మిగుల ఆవశ్యము. “నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది” అని షూలమతి చెప్పుచున్నది (ప.గీ. 5:2).
హృదయమును, ఆత్మయును మెలకువగలదై ఉన్నప్పుడు, సాతాను వలన మనలో గురుగులను విత్తలేడు. రాత్రి సమయములో ప్రార్థన తలంపుతో పరిశుద్ధాత్ముని యొక్క హస్తములలో మన హృదయమును అప్పగించుకుని నిద్రించుచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మెలకువగలవాడై ఉండును. శత్రువు వరదవలే పొంగి వచ్చినప్పటికిని, ప్రభువు యొక్క ఆత్ముడు వానికి విరోధముగా జయ్యద్వజమెత్తును.
మన యొక్క నిద్ర సమయములయందును, బలహీన సమయములయందును పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునట్లు వాక్కనిచ్చియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26).
మనము నిద్రించినను అందులోనూ ఒక మెలకువ మనకు అవశ్యము. నిద్రించుచున్నప్పుడు ప్రభువు యొక్క రాకడ ఉండినట్లయితే, ఆ కడబూర శబ్దము మన యొక్క చెవులకు వినబడునట్లుగా మనలో ఒక మెలకువ ఉండవలసినది అవశ్యము కదా? ప్రభువు వచ్చి తలుపును తట్టుచున్నప్పుడు వెంటనే ఆయనకు తలుపును తీయునట్లు మనము ఆసక్తితో కనిపెట్టుకొని ఉండవలెను కదా? (లూకా. 12:36).
“మీరు, ఈలాగున చేయుడి; కాలమునెరిగి నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొనుడి, మనము విశ్వాసులమైనప్పటి కంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది” (రోమీ. 13:11).
ఏలీయాను చూడుడి, ఎంతటి బలమైన ఒక ప్రవక్త! బదరీవృక్షము క్రింద నిద్రించెను. బ్రతుకుటకు ఇష్టము లేక నిద్రించుచుండెను. యెజెబెలునకు భయపడి పండుకొనియుండెను. అయితే ప్రభువు ఏలియాను ప్రేమతో తట్టి లేపెను. ఏలియా, నీవు వెళ్ళవలసిన దూరము బహుదూరము, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది అని చెప్పి ఒక బాధ్యతను అప్పగించెను. దేవుని బిడ్డలారా, నిద్రను విడిచి మేలుకొనుడి అప్పుడు ప్రభువు మిమ్ములను ప్రకాశింపచేయును.
నేటి ధ్యానమునకై: “మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను” (లూకా. 22:46).