No products in the cart.
నవంబర్ 01 – నిన్ను బట్టి!
“అందుకు లాబాను అతనితో: నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటిని” (ఆది.కా. 30:27).
కొందరిని బట్టి మనము ఆశీర్వదింప బడియున్నాము. యాకోబును బట్టియే ఆశీర్వదింపబడెను అని లాబాను మనసారా మాట్లాడుటను కొద్దిగా ఆలోచించి చూడుడి. ప్రభువు యొక్క ఆశీర్వాదము యాకోబుతో ఉండినందున యాకోబు ఎక్కడికంతా వెళ్లెనో, అక్కడంతా ఆయన చుట్టూతా ఉన్న ప్రజలు ఆశీర్వదింపబడిరి.
యాకోబును చూడుడి, యాకోబును బట్టి అతని యొక్క కుటుంబము అంతయును ఆశీర్వదింపబడుటతోపాటు, ఆయన ఎక్కడికంతా వెళ్లెనో అక్కడంతా ఆయన చూచినది ఆశీర్వాదమే. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అతడు తన యింటి మీదను తనకు కలిగినదంతటి మీదను (అతని) యోసేపును విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను” (ఆది.కా. 39:5).
అదే సమయములో, కొందరిని బట్టి బాధలును, వేదనలును, శాపములును కలుగుచున్నాయి. ప్రభువు యొక్క మాటకు లోబడక పోయిన ఒక ఆకానును బట్టి ఇజ్రాయేలీయులు అందరును ఓటమి పాలయ్యారు. ప్రభువు యొక్క స్వరమునకు లోబడని ఒక యోనాను బట్టి ఓడలో ప్రయాణము చేసిన అందరును వేదన చెందిరి., సరుకులన్నియు నష్టమైపోయెను, సముద్రము ఉప్పొంగెను.
దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషము మిమ్ములను పరిశీలించి చూచుకొనుడి. మీ కుటుంబమునకు మీరు ఆశీర్వాదమును తీసుకొని వచ్చుచున్నవారైయున్నారా? లేక శాపమును తీసుకొని వచ్చుచున్నవారైయున్నారా? మీ వలన మీ కుటుంబ సభ్యులు సంతోషమును, సమాధానమును, ఆనందమును పొందుచున్నారా? లేక వేదనయు, దుఃఖమును, కన్నీరును, సంచలత్వమును పొందుచున్నారా?
ఒక సహోదరుడు ఒకానొక కాలమునందు, తన కుటుంబ సభ్యులను దుఃఖపరచుచున్న వాడుగాను, సమస్యను కలుగజేయు వాడుగాను ఉండెను. అయితే ఎన్నడు ఆయన ప్రభువైన యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించెనో, ఆనాడే ఆయనను బట్టి ఆయన యొక్క కుటుంబము ఆశీర్వాదముగా మారెను. ఆయనను బట్టి ఆయన యొక్క గృహము ఆశీర్వదింపబడెను. ఎన్నడైతే ఆయన ప్రభువు యొక్క పరిచర్యను చేయుటకు ముందుకు వచ్చెనో, అందునుబట్టి అప్పుడే వేవేల కొలది కుటుంబములు ఆశీర్వదింపబడెను.
ప్రభువు అబ్రహామును పిలచినప్పుడు, ఆయనను బట్టి లోకమే ఆశీర్వదింపబడును అను సంగతిని వాగ్దానము చేసెను. ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును” (ఆది.కా. 12:3).
అదేవిధముగా యేసు క్రీస్తును బట్టి తండ్రియైన దేవుడు మన అందరిని ఆశీర్వదించుటకు సంకల్పించెను. ఆయనను బట్టి పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములను, ఆత్మ సంబంధమైన సమస్త ఆశీర్వాదములను. నిత్యత్వమునకు సంబంధించిన సమస్త ఆశీర్వాదములను మనము పొందుకొనుచున్నాము.
నేటి ధ్యానమునకై: “తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమీ. 8:32).