No products in the cart.
డిసెంబర్ 28 – మేలుకొను వేళ!
“మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి” (రోమీ. 13:11).
లోక ప్రకారమైన నిద్ర మనకు మిగుల అవశ్యమైయున్నది. మనము నిద్రించి విశ్రమించవలెను అనుట కొరకే ప్రభువు రాత్రి వేళను నియమించియున్నాడు. ప్రభువు తాను ప్రేమించుచున్న వారికి నిద్రను ఇచ్చుచున్నాడు.
అయితే ఆత్మీయ నిద్ర ప్రమాదకరమైనది. కాలము యొక్క విలువను ఎరుగక నిర్విచారముగా నిద్రలో ఉండుట మిగుల ప్రమాదకరమైనది. ఆత్మీయ మెలుకువ, ఆత్మీయ ముందంజ ఇట్టి సమయములయందు మనకు మిగుల అవశ్యమైయున్నది. మనకు విరోధముగా పోరాడుచూ ఉన్న అంధకార శక్తులకు విరోధముగా మనము నిలబడి యుద్ధము చేయవలసినది అవశ్యము (రోమీ. 13:12).
నోవాహు యొక్క కాలమునకు పూర్వము మనుష్యుల యొక్క దుర్మార్గపు జీవితమును, దోషములను చూచిన ప్రభువు మొదటి ప్రపంచమును జలప్రళయము చేత పూర్తిగా నశింపజేసి నూతన ప్రపంచములోనికి నోవాహును తీసుకొని వచ్చెను. నోవాహు యొక్క కుటుంబము ద్వారానే ఇక ఒక ఆశీర్వాదకరమైన ప్రపంచము అమర్చబడవలెను అని కాంక్షించెను. అయితే, “నోవాహు ద్రాక్షారసము త్రాగి, మత్తుడై, తన గుడారములో వస్త్రహీనుడుగా పండుకొనియుండెను” (ఆది.కా. 9:21).
నిద్రించుచున్న నోవాహు, ద్రాక్షరసము చేత మత్తుడైయున్న నోవాహు నిద్ర నుండి మేలుకొనవా? దిగంబరత్వము కనబడకుండునట్లు ఆత్మీయ వస్త్రమును కాపాడుకొనుట కొరకు మేలుకొనవా? నీ పిల్లల మీదను, నీ సంతతి మీదను రాబోవుచున్న శాపమును విరుచుటకు మేలుకొనవా? నోవాహు యొక్క ద్రాక్షారసము మత్తు నిమిత్తము కనానును అతని సంతతియు వ్యర్థముగా శపించబడిరే.
సంసోను, దేవుని యొక్క పరాక్రమ గల సూరుడా, ప్రభువు పక్షమున యుద్ధము చెయ్యవలసిన నీవు దెలీలా ఒడిలో నిద్రించుట ఏమిటి? నీ కన్నులు ఊడబెరుకుటకు ముందుగా, చేతులకు ఇత్తడి గొలుసులు బిగించుటకు ముందుగా, శత్రువుల దృష్టిలో నీవు వేడుక వస్తువుగా మారుటకు ముందుగా నిద్ర నుండి మేలుకొందువా? మీరు ప్రభువు కొరకు లేవవలసిన స్థాయికి ఇంకనూ లేవలేదే, ప్రభువు కొరకు ప్రకాశించవలసిన స్థాయికి ప్రకాశింపలేదే.
అగ్ని జ్వాలయైయున్న ఏలీయా, అగ్ని ద్వారా జవాబును ఇచ్చు దేవుడే దేవుడని కర్మీలు పర్వతము పై ఉజ్జీవమును తెచ్చిన ఏలీయా, నీవు బధరీవృక్షము క్రింద సొమ్మసిల్లిపోయి నిద్రించుట ఏమిటి? యెజెబెలు యొక్క ఆత్మను ఎదిరించి నిలబడక మనస్సునందు కృంగిపోవుట ఏమిటి? నీ బాధ్యత ముగియలేదే. నీ శక్తికి మించి వెళ్ళవలసిన ప్రయాణము బహుదూరము. నీ చేతుల మీదుగా అభిషేకింపబడుటకు విస్తారమైన వారు కనిపెట్టుచున్నారు. ఎలీషాలను లేవనెత్తవలసిన నీవు నిద్రించుచూ ఉండవచ్చునా?
యోనా, సొర చెట్టు క్రింద నీవు నిద్రించుచుండుట ఏమిటి? పురుగు తినివేయుట నీకు తెలియలేదా? నశించి పోవుచున్న ఆత్మలను గూర్చిన అక్కరలేదా? ప్రభువు కొరకు లేచి ప్రకాశింపవా? నీ యొక్క వర్తమానమును విని మారుమనస్సును పొందుటకు కోట్ల కోట్ల కోలది జనులు కనిపెట్టుచున్నారే!
దేవుని బిడ్డలారా, ఆత్మీయ నిద్రను మీ నుండి తీసివేయుడి.
నేటి ధ్యానమునకై: “ఇదిగో,చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది; యెహోవా నీమీద ఉదయించుచున్నాడు; ఆయన మహిమ నీమీద కనబడుచున్నది” (యెషయా. 60:2).