No products in the cart.
డిసెంబర్ 02 – ఇదివరకు!
“నీవు ఇదివరకు వినకపోతివి” (నిర్గమ. 7:16).
ప్రభువు యొక్క మాటకు చెవియొగ్గక పోయిన ఫరోను చూచి మోషే చెప్పిన మాటలే ఇవి: “అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి” (నిర్గమ. 7:16) అని మోషే చెప్పుచున్నాడు.
అనేకుల యొక్క జీవితమునందు ప్రభువు ఎంతగానో అద్భుతములను, సూచక్రియలను చేసినప్పటికీని, వారు దేవుని యొక్క మాటకు తమ్మును అర్పించుకొనక దూరముగానే నిలబడుచున్నారు. ఇంకా కొన్ని కుటుంబములలో శాపములును, తిరుగుబాటులును, ప్రభువు యొక్క ఉగ్రతయు, శిక్షలును ఎంతగానో వచ్చినప్పటికీ కూడాను, వారు గ్రహింపకయు చెవియొగ్గకుండా ఉండిపోవుచున్నారు.
ఆనాడు ప్రభువు మోషేను ఫరో యొద్దకు పంపించెను. మొదట అనేక అద్భుతములను జరిగించి ఇశ్రాయేలు ప్రజలను పంపించునట్లుగా ప్రభువు విన్నవించుకొనెను. మోషే యొక్క చేతిలో ఉన్న కర్రను పాముగా మార్చి చూపించెను. మోషే యొక్క చేతులకు కుష్ఠము వచ్చునట్లుగాను చేసి, అది మాయమగునట్లుగాను చేసెను. అయితే ఫరో, వాటినంతటిని లక్ష్యము చేయలేదు. దాని తర్వాత ప్రభువు ఫరోను, అతని జనమును, ఐగుప్తును తెగుళ్ళచేత మొత్తుటకు సంకల్పించెను.
ప్రభువు కొన్ని అంశములను మీయొక్క జీవితమునందు చేయుటకు తీర్మానించుచున్నప్పుడు, మొదట ఆ సంగతిని ప్రేమతో మీకు చెప్పవచ్చును. కొన్ని అద్భుతములను సూచక్రియలను జరిగించి మీకు వాస్తవమును గ్రహింప చేయవచ్చును. అప్పుడు కూడా మీరు అర్థము చేసుకోక పోయినట్లయితే ప్రభువు తన యొక్క శిక్షను పంపించును.
“ఇదివరకు నీవు వినకపోతివి” అని మోషే దుఃఖముతో ఫరోను చూచి చెప్పెను. దాని తర్వాత ఏమి జరిగినో తెలియునా? భయంకరమైన తెగుళ్లు ఫరోను ఆవరించుకొనెను. నదిలో ఉన్న నీళ్లు రక్తముగా మారెను. నదిలో ఉన్న చేపలన్నియును చనిపోయి కంపుకొట్టెను. దాని తర్వాత కప్పలు బయలుదేరి వచ్చెను, పేళ్ళు వచ్చెను, మిడతలు వచ్చెను. ప్రతి జీవరాశి మీదను భయంకరమైన తెగుళ్ల రోగమును, పొక్కులును వచ్చెను. వడగండ్ల వర్షము కురిసెను, అంధకారము కమ్మెను. అంతమునందు ఐగుప్తునందుగల తొలిచూలులందరును సంహరింపబడిరి.
ఆనాడు ఫరో, ప్రభువు యొక్క మాటకు చెవియొగ్గలేదు. అయితే నెనివే యొక్క రాజు, ప్రభువు యొక్క మాటకు వెంటనే చెవియొగ్గెను. మారుమనస్సు పొందెను, న్యాయ తీర్పు నుండి తప్పించుకొనెను.
ఆనాడు దేవుడు ఫరో యొద్ధకు మోషేను పంపించెను. అయితే ఈనాడు దేవుడు తన యొక్క ఏకైక కుమారుని సహితము మన కొరకు పంపించియున్నాడు. అయితే మనము చెవియొగ్గకుండాను, ప్రభువు యొక్క మాటను వినకుండాను పోయినట్లయితే, కృప ఎడబాపబడి న్యాయ తీర్పు కలుగును.
దేవుని బిడ్డలారా, నేడు ప్రభువు మనకు కృపను కనపరుచుచున్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మాటకు చెవియొగ్గి మనలను మనము అర్పించుకుందుమా?
నేటి ధ్యానమునకై: “నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉందువుగాని క్రిందివాడవుగా ఉండవు” (ద్వితీ. 28:14).