Appam, Appam - Telugu

జూలై 29 – సహాయము చేసేదెను!

“నీ దేవుడనైన యెహోవానగు నేనే, భయపడకుము; నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు, నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను”    (యెషయా. 41:13).

నేను నీకు సహాయము చేసేదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ విశ్వాసపు కన్నులచే ఇట్టి దృశ్యమును మీ అంతరంగమునందు ధ్యానించి చూడుడి.

భూమిని ఆకాశమును కలుగజేసిన సర్వశక్తి మంతుడైన దేవుడు, మీకు బహు సమీపముగా వచ్చి, మీ యొక్క హస్తమును తన ప్రేమ గల ఆస్తములచే పట్టుకొని, మిగుల ప్రేమతో,    ” భయపడకుము నేను నీకు సహాయము చేసెదను” అని సెలవిచ్చుచున్నాడు. ఇట్టి చక్కని వాగ్దానమును ఇచ్చుచున్న దేవుని కృతజ్ఞతతో స్తోత్రించెదరా?

ఒక దినమున యాకోబునకు ప్రభువు ఇట్టి ఆదరణకరమైన మాటలను చెప్పెను. అతడు తన సొంత సహోదరునిచే ద్వేషింపబడి కుటుంబమును విడిచి ఒంటరిగా బయటకు పారిపోవుచున్నప్పుడు, అతనికి సహాయము చేయువారు ఎవరును లేరు.  అనాధగా ఉన్నట్లు గ్రహించెను. అతని అంతరంగము దుఃఖముచే కలత చెంది అలమటించెను.

అయితే ప్రభువు, అతనికి సహాయము చేయుటకు సంకల్పించి, దర్శనందు నిచ్చెనను చూపించి, అతనితో వాత్సల్య పూర్వకమైన నిబంధనను చేసెను. ఎవరు అతనికి సహాయము చేయకపోయినను ప్రభువు అతనికి సహాయకరంగా నిలబడుటను యాకోబు చూసినప్పుడు యాకోబు యొక్క మనస్సునందుగల ఆనందమునకు హద్దులేకుండెను.

ఇట్టి వాగ్దానమును మరలా ఒక్కసారి కొద్దిగా ఆలోచించి చూడుడి.  1. దేవుడు మన కుడి హస్తమును పట్టుకునియున్నాడు. 2.  భయపడకుము అని దేవుడు మనకు ఆధరణను తెలియజేయుచున్నాను. 3. సహాయము చేసేదెను అని వాగ్దానము చేయుచున్నాడు. కావున, మూడు రకములైన వాగ్దానములను ప్రభువు ఈ ఒక్క వచనమునందు అనుగ్రహించుచున్నాడు.

  1. దేవుడు మన యొక్క కుడి హస్తమును పట్టుకునియున్నాడు:- వివాహమునందు స్త్రీల యొక్క కుడిచేతిని పట్టుకుని పెండ్లి కుమారుని యొక్క చేతికి అప్పగింతురు. వారు ఉన్నత స్థితియందును హీన స్థితియందును, సుఖమునందును దుఃఖమునందును ఒకరినొకరు ఎడబాయ కుందుమని దృఢ తీర్మానమును తెలియజేయుదురు.

దేవుని యొక్క హస్తమును పట్టుకునియున్న దేవుని యొక్క బిడ్డలారా, మిమ్ములను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించి, నిత్యమైన దయచేత హత్తుకొనుచున్న ప్రభువును తేరి చూడుడి. ఆయన మిమ్ములను అంతము వరకు త్రోవ నడిపించుటకు శక్తి గలవాడు. తొట్రిల్లకుండ కాపాడుటకు శక్తిగలవాడు. మీలో ప్రారంభించిన సత్క్రియలను అంతము వరకు నిలబెట్టుటకు శక్తిగలవాడు.

  1. భయపడకము అని దేవుడు మనకు ఆదరణను ఇచ్చుచున్నాడు:- బైబులు గ్రంథము అంతయును “భయపడకుము”  అను వాగ్దానము పలు స్థలములయందు చోటుచేసుకుని ఉన్నది. భయముతో నిండిన ఈ లోకమునందు ఆదరణ ఇచ్చువాడును, ఓదార్పు చేయువాడుగాను ప్రభువు మీకు సహాయము చేయుచున్నాడు. సముద్రము ఉప్పొంగ వచ్చును; తుఫాను విసరవచ్చును, అయినను, ప్రభువు మిగుల వాత్సల్యముతో. ‘నీవు భయపడకము, కలత చెందకము, నేను నీ దేవుడను’  అని చెప్పుచున్నాడు.
  2. సహాయము చేసేదను అని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు:- మనము ఎన్నడను ఒంటరిగా ఉండుటలేదు. ఆకాశము క్రింద విడిచిపెట్టబడిన స్థితియందు ఉండుటలేదు. మనము అనాధలముకాము. దిక్కుమాలిన వారము కాము, ప్రభువు మనకు సహాయము చేయుచున్నాడు. మన హృదయము కలవరపడక ఉండవలెను. ‘దేవుని వద్ద విశ్వాసము గలవారిగా ఉండుడి, నా వద్ద కూడాను విశ్వాసము గలవారై ఉండుడి’ అని ఆనాడు శిష్యులను ప్రభువు ఓదార్చి ఆదరించెను.

దేవుని బిడ్డలారా, ప్రభువు అలాగునే మిమ్ములను కూడా ఆదరించును. మీ హృదయము కలవర పడనియ్యకుడి.

నేటి ధ్యానమునకై: “నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను”     (కీర్తనలు. 63:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.