No products in the cart.
జూలై 15 – మనస్సునందు దీనత్వము!
“గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకొనుట కంటె, దీనమనస్సును కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు” (సామెతలు. 16:19).
దైవీక స్వభావములయందు మధురమైన స్వభావము మనస్సునందు దీనత్వమును ధరించుకొని ఉండుటయే. తగ్గింపు గల వారికి ప్రభువు కృపను ఇచ్చుచున్నాడు. తగ్గింపుగల వారిని ఆయన తేరి చూచుచున్నాడు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవుని యొక్క సేవకుడైయున్న స్పర్జన్ గారిని గూర్చి మీలో అనేకులు ఎరిగియుందురు. ఆయన ప్రసంగము యొక్క చాతుర్యముచేత వేల కొలది ప్రజలు ప్రభువు వద్దకు ఆకర్షింపబడిరి. ఆయన యొక్క ప్రార్థనాజీవితము చేత అనేకులు ప్రేరెపించబడి ప్రార్థన యోధులుగా మారియున్నారు. మరియు, ఆయన కలిగియున్న ప్రత్యేకమైన గుణము ఒకటి ఉందంటే అది ఆయన కలిగియున్న తగ్గింపుతనమే.
ఒకసారి స్పర్జన్ గారి యొక్క ఆలయమునందు ఆరాధన జరుగుచున్నప్పుడు, ప్రసంగ సమయము వరకును స్పర్జన్ గారు అక్కడ కనబడలేదు. స్పర్జన్ గారిని ఆలయము యొక్క పెద్దలు పలు స్థలములుయందు వెదకి చూచినప్పుడు, ఆయన ఒంటరిగా ఒక మూలలో మోకరించి ఏడ్చుచూ ఉండుటను చూచిరి. ఆయన యొక్క కండ్లు ఏడ్చి ఏడ్చి ఎర్రబారియుండెను. ఒక సంఘ పెద్ద వచ్చి, ఆయనను మెల్లగా తట్టి, “ప్రసంగించు సమయము వచ్చెను; వచ్చేదెరా?” అని ఆహ్వానించెను.
అయితే, స్పర్జన్ గారు: “లేదు, నేను రావడము లేదు. నేను ఎంతగానో ప్రసంగించినప్పటికీ కూడాను, కావలసినంత స్థాయికి ప్రజలు ఇంకను రక్షింపబడలేదు. కావున నేడు ప్రభువు నా ప్రార్ధనను ఆలకించేంతవరకును, నన్ను నేను తగ్గించుకొని ఏడ్చుచున్నాను; మీరు వెళ్లి ప్రసంగించుడి” అని చెప్పెను.
సంఘ పెద్దలో ఒకరు వేరే గత్యంతరము లేక, ప్రసంగపు పీఠమును ఎక్కి తనకు తెలిసిన దేవుని యొక్క వచనమును ప్రసంగించుటకు ఆరంభించెను. ఎవరు ఎదురుచూడని రీతిలో ఆనాడు ఆరు వందల మంది కంటే అత్యధికమైన వారు కన్నీటితో మారుమనస్సును పొందిరి.
మీరు ఎంతకెంతకు ప్రభువు యొక్క సముఖమునందు మిమ్ములను తగ్గించుకొనుచున్నారో, అంతకంతకు హెచ్చింపబడుదురు. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” (లూకా. 14:11).
“బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొనును; జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” (సామెతలు. 22:3,4).
యేసు చెప్పిన మాటలను మరచిపోకుడి. “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించు కొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడైయుండును” (మత్తయి. 18:3,4).
దేవుని బిడ్డలారా, మిమ్ములను మీరు ప్రభువు ఎదుట తగ్గించుకున్నప్పుడు, మీకు తెలియకుండానే ప్రభువును ఘనపరచుటతో పాటు ఆయనను మహిమ పరచుచున్నారు. ఆయన రాజ్యము యొక్క పరిపాలనను అంగీకరించుచున్నారు. అవును, ఆయన మిమ్ములను ఘణపరచి ఆశీర్వదించుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు” (మీకా. 6:8).