No products in the cart.
జూన్ 30 – నిత్య మధురము!
“మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను” (ప్రకటన. 21:4).
మార మధురమగును. ఇహమందును ప్రభువు మధురముగా చేసి ఇచ్చును. నిత్యత్వమునందును మధురముగా చేసి ఇచ్చును. ఒక దినమున ఈ లోకము యొక్క పరుగును ముగించుకొని ప్రభువు యొక్క రాజ్యములోనికి వెళ్ళుచున్నప్పుడు, దుఃఖములన్నియును మారి మరుగైపోవును. నిత్యానందము అక్కడ కలుగును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల పదివేలకొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసు నొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు” (హెబ్రీ. 12:22-24).
పరలోకమునందు కన్నీరు లేదు. కన్నీటినంతటిని దేవుడు తుడచి వేయుచున్నాడు. వేదన యొక్క దినములు సమాప్తమాయెను. యోబు భక్తుడు దుఃఖముతో చెప్పుచున్నాడు: “నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను” (యోబు. 16:21). దావీదు సెలవిచ్చుచున్నాడు: “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి” (కీర్తనలు. 56:8).
ప్రవక్తయైన యిర్మియా: “ఆ,… కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక” అని విలపించి ఏడ్చేను (యిర్మియా. 9:1). అయితే పరలోకమునందు ప్రవేశించుచున్నప్పుడు, ఇక మీదట నాకు కన్నీళ్లు లేవు అని చెప్పును. అంత మాత్రమే కాదు, అక్కడ దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను (ప్రకటన. 21:4) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
భూసంబంధమైన జీవితమునందు పలు దుఃఖములు విచారములు మిమ్ములను వేదనపరచవచ్చును. అయితే పరలోకమునందు చేదు అనుట లేకుండా పరిపూర్ణముగా మధురముతో నిండియుండును ఒక స్థలము. అట్టి తేజోమయమైన దేశమునందు యేసు యొక్క రొమ్మున ఆనుకొని మనము సౌఖ్యముగా ఉందుము. అంత మాత్రమే కాదు, పరలోకమునందు శాపము లేదు. “ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు” అని ప్రకటన. 22:3 నందు చదువుచున్నాము. ఆదామునందు లోకము శపించబడెను. అయితే యేసు శపించబడిన సిలువ మ్రాణులో వేలాడెను. సమస్త శాపములను భరించెను. ఇకమీదట శాపము మనలను వెంబడించదు.
పరలోకమునందు ఆకలి లేదు, దప్పిక లేదు. “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు” (ప్రకటన.7:16). అది ఎంతటి ధన్యకరమైన నిత్య దేశము! దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రభువు అక్కడ నివాస స్థలములను సిద్ధపరిచెను.
నేటి ధ్యానమునకై: “దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొఱ్ఱెపిల్లయే దానికి దీపము” (ప్రకటన. 21:23).