No products in the cart.
జూన్ 19 – బానిసయొక్క హస్తములు
ఇశ్రాయేలీయులలో బానిసలకంటూ మరికొన్ని చట్టదిట్టములు ఉండెను. వారిలో ఎవరైనను హెబ్రీయుడైన బానిసగా ఉండినట్లయితే, ఆరు సంవత్సరములు అతడు ఆ యజమానునికి బానిసయైయుండి పనిచేయవలెను. పెండ్లి చేసుకునిన బానిసయై ఉండినట్లయితే భార్య బిడ్డలతో కూడా విడిపించబడవలెను. దాని తర్వాత అతడు స్వాతంత్రుడైయుండును. అతనికి ఇష్టము వచ్చిన చోటుకి ఎక్కడికైనను వెళ్ళవచ్చును. ఎట్టి వృత్తినైనను చేయవచ్చును.
ఒకవేళ ఆ బానిస తన యజమానుడ్ని, అతని యొక్క కుటుంబ సభ్యులను మిగుల ప్రేమించి, దాని కారణముచేత విడుదల పొందకోరక కొనసాగించి యజమానితో ఉండుటకు కోరిన యెడల దానికి కూడా ఒక చట్టదిట్టమును ఇశ్రాయేలీయులు కలిగియుండెను.
ఆ యజమానుడు, ఆ బానిసను వెంటపెట్టుకొని న్యాయాధిపతుల వద్దకు వెళ్లి, అతనిని తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని యజమానుడు వాని చెవిని కదురుతో గుచ్చవలెను. దాని తరువాత వాడు నిరంతరము వాని యజమానుని వద్ద బానిసయై (దాసుడై)యుండును (నిర్గమ. 21:1-6).
ఇశ్రాయేలీయులలో చెవిని కదురుతో గుచ్చబడియున్న బానిసలను కలసినట్లయితే, అతడు విడుదల పొందుటకు కోరుకొనక యజమానితోనే నిలచియున్న బానిస అను సంగతిని, తన యజమానుని ప్రేమించుచున్న బానిస అను సంగతిని మనము గ్రహించగలము.
యేసు మన కొరకు (దాసుని) బానిస రూపమును ధరించెను. బానిసవలె శిష్యుల యొక్క పాదములను కడిగెను. బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, (దాసుని) బానిస స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను” (ఫిలిప్పీ. 2:6,7). అట్టి యేసుక్రీస్తును తేరి చూడుడి.
ఇశ్రాయేలీయులలో యజమానునితో నిలిచి ఉండుటకు తన ఇష్టమును తెలియజేయు బానిసకు చెవులకు మాత్రమే కుదులతో గుచ్చిరి. అయితే,బానిస యొక్క రూపమును ధరించి మనతో ఉండుటకు ఇష్టపడిన యేసుక్రీస్తునికైతే, చేతులయందును, పాదములయందును పొడిచేరి (కీర్తన. 22:16).
పొడవ బడిన తన చేతులను, పాదములను ఆనాడు తోమాకును, మిగతా శిష్యులకును ప్రభువు ప్రేమతో చాపి వారికి చూపించెను (లూకా. 24:40). ‘నేను ఎల్లప్పుడును మీతో కూడా ఉండబోవుచున్నాను. యుగ సమాప్తి వరకు ప్రతి దినమును నేను మీతో కూడా నిలచి ఉండబోవుచున్నాను. నేను మిమ్మల్ని విడిచి ఎడబాయను. మిమ్ములను చేయి విడిచి పెట్టను’ అని చెప్పుచున్నట్టుగా ఈ సంఘటన కూర్చబడియున్నది.
పునరుత్థానుడైన యేసు క్రీస్తు యొక్క ప్రసన్నత పరలోకమునంతటిని నింపియున్నది, భూలోకమునంతటిని నింపియున్నది. పరలోకమునందు దేవుని కుడి పార్శ్వమునందు కూర్చుండియున్నవాడై తన యొక్క గాయములను మన కొరకు తండ్రి వద్ద చూపించి విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకుడైయున్నాడు. అదే సమయమునందు తన యొక్క పరిశుద్ధ ఆత్మ చేత లోకమంతటా ఉన్న దేవుని బిడ్డలతో కలసి, మనతో నివాసముంటున్న ఆదరణ కర్తవలె ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఇది ఎంతటి ధన్యకరమైనది! అట్టి ప్రేమ ఎంతటి లోతైనది!
నేటి ధ్యానమునకై: “జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను” (హెబ్రీ. 2:15).