No products in the cart.
జనవరి 30 – దేవుని చిత్తమునందు నిలిచియుండుడి!
“లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” (1. యోహాను. 2:17).
బైబిలు గ్రంథము నందు నిరంతరము ఉండేటువంటి ఆశీర్వాదములను గూర్చి వ్రాయబడియున్నది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుచున్నప్పుడు, ప్రభువు అక్కడ శాశ్వత ఆశీర్వాదమును, జీవమును సెలవిచ్చుచున్నాడు (కీర్తనలు. 133: 1-3). యెహోవాను కాపరిగా కలిగియున్నప్పుడు, మనము యెహోవా యొక్క మందిరములో చిరకాలము నివాసము చేసెదను. నిరంతరమును నిత్య జీవము ప్రభువు వాగ్దానము చేసియున్నాడు (యోహాను. 17:3).
పైన చెప్పబడియున్న వచనమును గమనించుడి. దేవుని యొక్క చిత్తము చొప్పున మనము చేయవలెను. అప్పుడే నిరంతరమును నిలిచియుందుము. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే దైవ చిత్తమును ఎలాగు నెరవేర్చవలెను అను సంగతిని మనకు బోధించుట కొరకే.
ఆయన భూమి మీదకి వచ్చుటకు ముందుగా నిత్యత్వమునందు తండ్రిని చూచి: “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను” (హెబ్రీ. 10:7) అని చెప్పెను. ఆయన యొక్క పరిచర్యయు, క్రియలును తండ్రి యొక్క చిత్తమును చేయుచున్నట్లుగానే ఉండెను. “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది” అని ఆయన పలుమార్లు చెప్పెను. (యోహాను. 4:34, 6:38).
ఆయనకంటూ ఒక సొంత ఇష్టముండెను. అందరి వలె ఆయనకు స్వచిత్తము ఉండెను. అయితే ఆయన తన యొక్క మనస్సు శరీరమును కోరుకున్న వాటిని చేయక సంపూర్తిగా తన యొక్క చిత్తమును తండ్రి యొక్క చిత్తమునకు సమర్పించుకొనెను. “నా అంతట నేనే ఏమియు చేయలేను; …. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక ….” అని చెప్పెను (యోహాను. 5:30). సిలువ చెంతకు వచ్చుచున్న సమయము వచ్చినప్పుడును, “అయినను నా యిష్టప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము” అని అప్పగించుకొనెను (మత్తయి. 26:39; లూకా. 22-42).
యేసు తండ్రి యొక్క చిత్తమును చేయుట మాత్రము గాక, మనము కూడాను తండ్రీ యొక్క చిత్తమును చేయునట్లుగా మనకు బోధించుచున్నాడు. తన శిష్యులకు ప్రభువు యొక్క ప్రార్థనను నేర్పించుచున్నప్పుడు, “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించునట్లు చెప్పెను. అవును, భూమి మీద దేవుని చిత్తము నిశ్చయముగానే చేసి ముగించవలెను. దేవుని చిత్తము చేయుటకు మిమ్ములను సమర్పించుకొందురా?.
కొన్ని దైవ చిత్తములను దేవుడు మనకు తెలియజేసియున్నాడు. “మీరు పరిశుద్ధులగుటయే,… దేవుని చిత్తము” (1. థెస్స. 4:3). “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1. థెస్స. 5:18). “అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము” (1. పేతురు. 2:15).
దేవుని బిడ్డలారా, బైబులు గ్రంథమును చదివి, దాని ప్రకారము నడువుడి. ప్రభువు తన చిత్తము యొక్క కేంద్రమునందు మిమ్ములను కాపాడు కొనును.
నేటి ధ్యానమునకై: “తన యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును” (లూకా. 12:47).