No products in the cart.
అక్టోబర్ 13 – పరిపూర్ణమైన పరిశుద్ధత!
“సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక” (1. థెస్స. 5:23)
మన యొక్క దేవుడు సకల మేళ్లులను పరిపూర్ణముగా దయచేయుచున్న దేవుడు. ఆత్మ ప్రాణము శరీరము అంతటికిని పరిశుద్ధతను ఇచ్చి తొట్టిలకుండా చివరి వరకు స్థిరపరచుచున్న దేవుడు. మన దేవుడైన ప్రభువు ఒక్కడు మాత్రమే తన యొక్క పరిశుద్ధతను మనకు ఇచ్చుటకు శక్తిమంతుడు.
ఈ భువియందు మనలను గూర్చి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి? అవును, మనలను సంపూర్ణముగా పరిశుద్ధ పరచుటయే ఆయన యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు వచ్చుచున్నప్పుడు, మనలను నిందారహితులుగా నిలబెట్టుటకే ఆయన కోరుచున్నాడు. అందు నిమిత్తమే ప్రభువు పరిశుద్ధాత్మను మనకు దయచేయుచున్నాడు.
“అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి” అని రోమీ. 15:15 నందు చదువుచున్నాము. పరిపూర్ణముగా పరిశుద్ధ పరచుటకైన ఇట్టి గొప్ప పరిచర్యయందు పరిశుద్ధ ఆత్ముని యొక్క వంతును చూడవచ్చును.
పరిశుద్ధాత్ముడు చేయుచున్న మొదటి అంశము పాపము యొక్క బలము నుండి, దుర్మార్గపు అలవాటులనుండి పాపియైన మనుష్యుడ్ణి విడిపించుచున్నాడు. ఆనాడు పేతురు ప్రసంగించినప్పుడు, వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరి యొక్క హృదయము నందును క్రియను చేసినప్పుడు, వారు పాపమును గూర్చి గ్రహింపబడిరి. “సహోదరులారా, రక్షింపబడుటకు మేము ఏమి చేయవలెను? అని అడిగిరి. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేయుటయే (యోహను. 16:8) దీనికిగల కారణము.
రెండోవది, పరిశుద్ధాత్ముడు రక్షింపబడిన దేవుని యొక్క బిడ్డలకు పాపముపై ఒక విజయమును ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు అని ఆయన వాగ్దానము చేసియున్నాడు (అపో. 1:8). కావున పరిశుద్ధాత్ముని యొక్క శక్తి సామర్థ్యముల చేత ఓటమీలను విజయముగా మార్చుచున్నాము, ఆటంకములను పడగొట్టి పైకెక్కుచున్నాము.
మూడోవదిగా, పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితమునందు శక్తిని తీసుకొని వచ్చుచున్నాడు. పరిచర్యను చేయుటకు కావలసిన శక్తిని మనకు దయచేయుచున్నాడు. శత్రువుల వసమునుండి ఆత్మలను విడిపించే శక్తి లభించుచున్నది. పాతాళము యొక్క ద్వారములను నుజ్జునుజ్జు చేసి, సంఘములను స్థాపించేటువంటి శక్తి లభించుచున్నది. ప్రజలకు మేలు చేసేటువంటి శక్తియు కృపయు లభించుచున్నది.
నాల్గోవదిగా, పరిశుద్ధాత్ముడు మనలో నివసించి, దైవీక స్వభావమును మనలోనికి తీసుకుని వచ్చి, మనలను పరిశుద్ధతయందు పరిపూర్ణత చెందించును. దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? (1. కోరింథీ. 3:16). పరిశుద్ధాత్ముడు ప్రతి దినమును మీయందుండి, రూపాంతరము చెందేటువంటి అనుభవములోనికి మిమ్ములను బహుచక్కగా నడిపించుకని వెళ్ళును.
నేటి ధ్యానమునకై: 📖”మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే (మార్చబడుచు) రూపాంత్రము చెందుచున్నాము” (2. కోరింథీ. 3:18).