No products in the cart.
మార్చి 27 – ప్రేమ ఉప్పొంగదు!
“ప్రేమ …. ఉప్పొంగదు … ” (1. కొరింథీ. 13:4).
తనను గూర్చి తాను అధికముగా ఎంచుకొనుటయే ఉప్పొంగుటకు గల కారణమునైయున్నది. “జ్ఞానము ఉప్పొంగజేయును” (1. కొరింథీ. 8:1). “శరీరసంబంధమైన మనస్సు ఊరకనే ఉప్పొంగుచు” (కొలస్సీ. 2:18). “నాశనము రాకమునుపు నరుని హృదయము ఉప్పొంగును” (సామెతలు. 18:12) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
విలియం కేరి యొక్క ఉప్పొంగని, దైవీక ప్రేమలోని స్వభావమును తలంచుచున్నప్పుడల్లాను నా హృదయము శ్రవించుచుండును. ఆయన చెప్పులు కొట్టుకొను వృత్తి గలవాడిగా తన జీవితమును ప్రారంభించినను, చివరకు శ్రేష్టమైన దైవ సేవకునిగాను, మిషనరీగాను, త్యాగిగాను, దైవీక ప్రేమతో నిండిన వాడిగాను ఉండెను.
ప్రభువుపై అమితమైన ప్రేమను ఉంచిన ఆయన, భారత దేశపు భాషలను నేర్చుకుని ముప్పై నాలుగు భాషలలో బైబిలు గ్రంథమును తర్జుమాచేసి ఆవిష్కరించెను. ఆయన యొక్క భాషా పాండిత్యమును, బుద్ధి జ్ఞానమును, పట్టు విడవని తనమును బహు గొప్పది.
విలియం కేరి పేరుగాంచిన వాడిగా, పలు విశ్వవిద్యాలయములను స్థాపించినప్పటికిని, ఒక్కడు ఆయనను కించపరచవలెనని కోరి, అందరు కలిసి ఒకటిగా భోజనము చేయుచున్నప్పుడు: ‘విలియం కేరి, మీరు పూర్వమునందు చెప్పులను తయారు చేసేవారు కదా’ అని ఎటకారముగా అడిగెను.
ఆ మాటను విన్న విలియం కేరి లేచి నిలబడి, మిగుల తగ్గింపుతో: “అయ్యా, మీరు నన్ను ప్రేమతో చెప్పులు తయారు చేసేవాడను అని కదా చెప్పారు. నేను చెప్పులు తయారు చేసే వాడను కాదు. చిరిగిపోయిన చెప్పులను కుట్టేటువంటి కూలివాడనయ్యా” అని చెప్పెను. ప్రభువు కొరకు ఎట్టి హేళనమైన మాటను కూడాను సంతోషముతో స్వీకరించేటువంటి అతని యొక్క దైవీక ప్రేమ నా హృదయమును శ్రవింపజేసేను. అవును ప్రేమ ఉప్పొంగదు.
అదే విధముగా మనము కూడాను ఉప్పొంగక కన్నీటితో ప్రభువు వద్దకు తిరిగి వచ్చుటయే ప్రభువు ఆశతో ఎదురుచూచున్నాడు. అలాగున వచ్చుచున్నప్పుడు, వెంటనే మనలను హత్తుకుని, మన కన్నీళ్లను తుడిచి మన పాపములను, దోషములను సమస్తమును క్షమించి మరచి మనలను ప్రేమించుచున్నాడు. అవును అయిన ప్రేమ ఎంతటి మాధుర్యమైనది!
ఆనాడు తప్పిపోయిన కుమారుడు పశ్చాతాపముతో తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రేమగల తండ్రి ఏమి చేసెనో తెలియునా? కుమారుడింక దూరమునందు వచ్చుచున్నప్పుడే అతని తండ్రి వానిని చూచి, కనికరపడి, పరుగెత్తి వాని మెడ మీదపడి వానిని ముద్దుపెట్టుకొనెను (లూకా. 15:20) అని బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము.
కుమారుడు క్షమాపణను అడిగెంతవరకు కూడా ఆ తండ్రి వలన తట్టుకొన లేకపోయెను. మారుమనస్సు పొందే కుమారుడు ఏడ్చేదృశ్యమును మనస్సునందు ధ్యానించి చూడుడి. మీరు కన్నీటితో ప్రభువు వద్దకు తిరిగి వచ్చుచున్నప్పుడు అలాగుననె ప్రభువు కూడాను మిమ్ములను ఆప్యాయతతో స్వీకరించును.
దేవుని బిడ్డలారా, మన ప్రభువు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, మన ప్రేమ కొరకు పరితపించువాడు కూడాను. మనము ఆయనను ప్రేమింపకుండా ఉండినట్లయితే, ఆయన ఎవరి వద్దకు ప్రేమ కొరకు వెళ్ళును? మనలను ప్రేమతో సృష్టించెను. ఎంతటి ప్రేమతో మన కొరకు ప్రాణమును పెట్టెను! అట్టి ప్రేమకు సరి సాటియైన ప్రేమ కలదా?
నేటి ధ్యానమునకై: “మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును” (1. కొరింథీ. 8:1).
