Appam, Appam - Telugu

ఫిబ్రవరి 25 – పేరు పెట్టి పిలచి!

“జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని దానియేలును అడిగెను” (దానియేలు. 6:20).

ప్రభువు మనలను పేరు పెట్టి పిలచువాడు. మనము ఈ లోకమునందు పుట్టుటకు మునుపే తల్లి గర్భమునందే ఆయన మనలను ముందుగా తన కొరకు ఏర్పరచు కొనినవాడు. ఆయన మనలను పేరు పెట్టి పిలుచున్నప్పుడు మన యొక్క అంతరంగమంతయును పరవశించుచున్నది.

దానియేలు యొక్క తల్లిదండ్రులు ఒక అర్థవంతమైన పేరును అతనికి పెట్టిరి. దానియేలు అను పదమునకు “దేవుడే నా న్యాయాధిపతి” అనుట అర్థము. అట్టి పేరును వినుచున్నప్పుడెల్లను దానియేలులో ఒక భయభక్తి ఏర్పడి ఉండవలెను. ‘నా వాదనయందు నాకు న్యాయ విచారణ చేయు దేవుడొక్కడు కలడు, భయ భక్తితో జీవించవలెను’ అను తలంపు దానియేలులో కలిగి యుండియుండును.

అయితే దానియేలు బబులోనులోనికి వచ్చినప్పుడు అతనికి బెల్తెషాజరు అని పేరును పెట్టిరి (దానియేలు. 1:7). ఈ పదమునకు “బేలు నన్ను కాపాడును” అనుట అర్థమునైయున్నది. అయితే అట్టి కొత్త పేరు మనుగడలో లేకుండా పోయెను.

దానియేలు తన పేరుకు తగినట్లుగా యెహోవాయే న్యాయాధిపతిగా ఉన్నాడు అను సంగతిని గ్రహించి, మనుష్యుల ఎదుటను, దేవుని ఎదుటను నిందారహితుడిగా జీవించెను. అట్టి పేరు అతనియందు ఎల్లప్పుడును ఒక పరిశుద్ధతను కలుగజేయుచునే ఉండెను.

రాజగు దర్యావేషు, దుఃఖ స్వరముతో, ‘దానియేలు, జీవముగల దేవుని సేవకుడా’ అని దానియేలును పిలుచుటను బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము. జీవముగల దేవుని సేవకుడా అని ఒక రాజు పిలుచుచున్నప్పుడు డానియలు యొక్క అంతరంగమునందు ఎంతటి ఆనందము కలిగి ఉండవచ్చును!

మీ యొక్క పేరును లోకస్తులు వినుచున్నప్పుడు మీరు జీవముగల దేవుని యొక్క దాసుడు అను సంగతిని గ్రహించుకొనవలెను. మీరు నిత్యమును దేవుని ఆరాధించువారు అను సంగతిని వారు తెలుసుకొనవలెను. మీ యొక్క పేరును ఉత్తినే పిలువక దేవుని యొక్క మనుష్యుడైన ఫలానా అని వారు పిలుచున్నప్పుడు అది ఎంతటి ఔన్నత్యముగా ఉండును!

దానియేలును ప్రభువు ఎలాగు పిలిచెను అను సంగతిని బైబిలు గ్రంథమునందు చూచుచున్నప్పుడు, “దానియేలూ, నీవు నాకు బహు ప్రియుడవు” అని పిలుచుటను చూచుచున్నాము. (దానియేలు.10:11). మరొక్క స్థలమునందు “నీవు బహు ప్రియుడవు, అని పిలిచెను (దానియేలు. 10:18). మరొక్క స్థలమునందు “నీవు బహు ప్రియుడవు” అని చెప్పెను (దానియేలు. 9:23). ఆ! అట్టి పిలుపు ఎంతటి ఔన్నత్యమైనది!

దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్మలను ప్రేమతో నాకు బహు ప్రియుడవు అని పిలిచినట్లయితే, అది ఎంతటి మధురముగా ఉండును అను సంగతిని ఆలోచించి చూడుడి. ప్రభువు అలాగున పిలుచునట్లు ఆయనకు ప్రీతికరమైన జీవితమును జీవించెదరా?

నేటి ధ్యానమునకై: “మా దేవుడైన యెహోవా ప్రీతి (ప్రసన్నత) మా మీద నుండును గాక; మా చేతిపనిని మాకు స్థిరపరచుము” (కీర్తనలు. 90:17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.