Appam, Appam - Telugu

ఫిబ్రవరి 10 – నాకు వేరుగా ఉండి!

“ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” (యోహాను. 15:5).

ప్రార్థించేటువంటి దేవుని యొక్క బిడ్డలు ప్రభువును మాత్రమే ఆనుకొందురు. జార్జ్ ముల్లర్ గారు నిర్వహించిన అనాధ ఆశ్రమమును గమనించుకొనుటకు ఒక నిర్వాహకపు బృందము ఉండెను. ఆయా బృందములవారు ఆయా ఆశ్రమమునకు అది కావలెను, ఇది కావలెను, ధనమును వసూలు చేయవలెను, ధనికులను సంప్రదించవలెను అని అనేక ప్రయత్నములను చేసిరి. అయితే ఏ ఒక్కరును వారికి సహాయము చేయుటకు ముందుకు రాలేదు.

కావున విచారముతో తిరిగి వచ్చిన వారిని చూచి జార్జ్ ముల్లర్ గారు: “మీరు ప్రభువునే ఆనుకొనవలెను. ప్రార్థనలోనే నిలిచి ఉండవలెను” అని చెప్పి ఆయన తన యొక్క నిర్వాహకపు బృందముతో కలసి ప్రార్థించుటకు ప్రారంభించెను. వారు ప్రార్ధించగా ప్రార్థించగా, ప్రభువు ఆకాశపు వాకిండ్లను తెరిచెను. ఎదురుచూడని అనేక స్థలముల నుండి సహాయము వారిని వెతుక్కుంటూ వచ్చి రాశులుగా కూర్చబడెను.

మనము మొదట ఈ సత్యమును నేర్చుకున్నట్లయితే పలు ఏమరపాటులకు గురి కాకుండా ఉంటాము. ప్రభువు ఎదుట నిలబడుచున్న మనుష్యుడు అల్పులైన మనుష్యుల వద్దకు వెళ్లి చేయి చాప వలసిన ఆవశ్యము ఉండదు.

యాకోబు యొక్క జీవితమును కాస్త ఆలోచించి చూడుడి. ఆయన తన యొక్క యవ్వన కాలమునందు తన యొక్క సొంత జ్ఞానమునందు ఆనుకొనియుండెను. అన్నయ్యను ఏమార్చి, బహుతంత్రముతో జేష్ఠత్వపు హక్కును అపహరించెను. అయితే ఒక దినమున ఏశావు నాలుగువందల మందితో తనను ఎదుర్కొని వచ్చుచున్నాడు అని విన్నప్పుడు యాకోబు యొక్క హృదయము కలవరపడెను. యుద్ధమునకు వచ్చుచున్నట్లు వచ్చి తనను హతమార్చినట్లయితే ఏమి చేయాలని భయపడెను.

అట్టి చివరి సమయమునందు ఎవరి సహాయము కూడాను దొరకకపోయెను. తన యొక్క సొంత నెలవరులలో ఏ ఒక్కరు కూడా అండగా నిలబడలేని పరిస్థితి. ప్రభువును మాత్రము ఆనుకొనుట తప్ప ఆయనకు వేరొక్క మార్గము లేదు. ఆయన కన్నీటితో దేవుని తట్టు చూచి ప్రార్థించెను. రాత్రి అంతయు ప్రభువుతో పోరాడెను. అవును, అట్టి అనుభవము యాకోబు యొక్క జీవితమునందు ఒక గొప్ప మలుపుగా అమర్చబడెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; అప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువకుండుట చూచి, తొడగూటిమీద అతనిని కొట్టెను; అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన: తెల్లవారుచున్నది, గనుక నన్ను పోనిమ్మనగా, అందుకు అతడు: నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను” (ఆది.కా. 32:24-26).

అంత మాత్రమే కాదు, “తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను; మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను; బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను” (హోషేయా. 12:3,4). దేవుని బిడ్డలారా, మీరు సంపూర్ణముగా ప్రభువునందు ఆనుకొని ఉండుట చేత, ఆయనే మన యొక్క పూర్తి నమ్మికకు పాత్రుడు అను సంగతిని కనుగొందుము.

నేటి ధ్యానమునకై: “నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను; నేను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను; …. నా మందిరము సమస్తజనులకు ప్రార్థన మందిరమనబడును” (యెషయా. 56:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.