No products in the cart.
నవంబర్ 04 – నా కొరకు ఎవరు ఉన్నారు!
“దేవా నా కార్యమును నీ మీద వేసుకొనే ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము; మరి యెవడు నా నిమిత్తము పూటపడును?” (యోబు. 17:3).
నాకంటూ ఎవరు లేరనియు, నా సమస్య ఎవరికి తెలియలేదే అనియు, నా పోరాటపు సమయములయందు చేయూతనిచ్చు వారు ఒకరును లేరే అనియు అనేకమంది కలవరపడుటను చూచుచున్నాము.
యోబు భక్తుడు కూడాను, ‘నా కొరకు చేయూతనిచ్చి పూటపడువారు ఎవరు’ అని చెప్పి విలపించి ఏడ్చుటకు బదులుగా ప్రభువును తేరి చూచి, “దేవా నా కార్యమును నీ మీద వేసుకొనే ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము” అని ప్రార్థించెను.
ఇదే విధముగా మా తండ్రిగారి యొక్క జీవితమునందును ఒక సమస్య వచ్చెను. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలయందు గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగమును చేయుచున్నప్పుడు, ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగ అవకాశము కొరకు ఒక వ్రాత పరీక్ష జరిపించబడెను. మా నాన్నగారు ఈ పరీక్షను చాలా చక్కగా వ్రాసి ఉండెను. ఉద్యోగము దొరుకుటకు అవకాశముండెను.
అయితే వ్రాత పరీక్ష తరువాత ఇంటర్వ్యూ కొరకు ఆయనకు పంపబడిన పిలుపు, గడువు ముగిసిన తర్వాతనే ఆయన చేతికి వచ్చి చేరెను. ఆయన యొక్క హృదయము బద్దలైపోయెను. ఇట్టి సమయమునందు నాకు చేయూతనిచ్చు వారు ఎవరు, నాకు సహాయము చేయువారు ఎవరు అని, ప్రభువును తేరి చూచి మొరపెట్టెను.
ఆయన ప్రభువునకు మొరపెట్టినప్పుడు, అకస్మాత్తుగా ప్రభువు ఆయనకు అదే శాఖలో ఉద్యోగము చేయుచున్న ఒక క్రైస్తవ సహోదరిని జ్ఞాపకము చేసెను. వెంటనే వారి ఇంటికి పరిగెత్తుకొని వెళ్లి జరిగిన సంగతి అంతటిని వారికి తెలియజేసెను. వారు మా తండ్రిగారి వద్ద, “భయపడవద్దు, ఇంటర్వ్యూ పరీక్షను జరిగించువారు నా యొక్క అధికారియే, నేను వారి వద్ద మాట్లాడెదను. నిశ్చయముగానే మరొక్క దినమును మీకు కేటాయించును” అని చెప్పెను. అలాగునే చేసారు, మా తండ్రి గారికి ప్రభుత్వమునందు వెనువెంటనే ఉద్యోగము లభించెను.
బైబిలు గ్రంథమునందు 38 సంవత్సరములుగా బెతస్థ కోనేటి వద్ద పండుకొనియున్న ఆ పక్షవాయు గలవాడు వేదనతో నీళ్లు కదిలింపబడుచున్నప్పుడు నన్ను కోనేటి లోనికి తీసుకుని వెళ్లి దించువారు ఎవరున్నారు, ఏ ఒక్కరును లేరే అని చెప్పి విలపించెను. ప్రభువు అతనిపై జాలిపడి, ” లెమ్ము, నీ పరుపుని ఎత్తుకొని నడువుము” అని చెప్పి అతనిని స్వస్థపరచెను.
నా కొరకు ఎవరున్నారు అని విలపించేటువంటి సందర్భము కీర్తనకారునికి కూడాను వచ్చెను. “నన్ను కరుణించు వారికొరకు కనిపెట్టు కొంటిని గాని యెవరును లేకపోయిరి; ఓదార్చువారి కొరకు కనిపెట్టు కొంటిని గాని యెవరును కానరారైరి” (కీర్తనలు. 69: 20) అని ఆయన చెప్పుచున్నాడు. ఒక దినమున ఆ కీర్తనాకారుడు తన నమ్మిక అంతటిని ప్రభువుపై ఉంచి: “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కరలేదు” (కీర్తనలు. 73:25) అని చెప్పెను.
దేవుని బిడ్డలారా, నా కొరకు ఎవరు ఉన్నారు అని చెప్పి కలత చెందక, అధైర్య పడక, ‘నా కొరకు ప్రభువు కలడు’ అని చెప్పి, ఆయన యందు విశ్వాసము గలవారై ఉండుడి.
నేటి ధ్యానమునకై: “ఇదిగో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన ఆశ్చర్యకార్యమేదైన నుండునా?” (యిర్మియా. 32:27).