No products in the cart.
జనవరి 15 – మండుచుండు హృదయము!”
“నా గుండె నాలో మండుచుండెను; నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార విజ్ఞాపన చేసితిని” (కీర్తనలు. 39:3).
ధ్యానించు జీవితమే హృదయమునందు అగ్నియు మంటయు తీసుకొని వచ్చుచున్నది. ఇస్సాకు ఒక ధ్యానించే పురుషుడైయుండెను. సాయంకాల సమయమునందు ఏకాంతములోనికి వెళ్లి ప్రభువును గూర్చియు ఆయన యొక్క వాగ్దానమును గూర్చియు ధ్యానించుచున్న అలవాటును కలిగియుండెను. అతని తరువాత మిగుల గొప్పగా ధ్యానించే పురుషుడు అంటే అది దావీదైయుండెను. “యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు” (కీర్తనలు. 1:2) అని ఆయన వ్రాయుచున్నాడు.
అన్ని ధ్యానములకంటేను మిగుల ఔన్నత్యమైన ధ్యానము సిలువను గూర్చిన ధ్యానమే. ఎంతకెంతకు సిలువులో వ్రేలాడిన క్రీస్తును గూర్చి మీరు ధ్యానించుచున్నారో, అంతకంతకు మీ హృదయము మండుచుండును. దేవుని యొక్క ప్రేమ మీయందు అత్యధికమగును.
ఒక దైవ సేవకున్ని ప్రభువు బహు బలముగా వాడుకొనెను. కారణము, ఆయన తన యొక్క ప్రార్థనయందు మూడు దినములు లేక నాలుగు దినములు దేవుని సముఖమునందు పడియుండి ఆసక్తితో ప్రార్ధించును. “నేను మోకరించుచున్నప్పుడెల్లను, సిలువలో ముళ్ళ కిరీటమును ధరించబడ్డ ఆయన యొక్క శిరస్సును చూచెదను. ఒక్కొక్క గాయముగా తలంచి తలంచి, ఇది నా కొరకే కదా అని చెప్పి కన్నీళ్ళను చిందించెదను. దేవుని యొక్క ప్రేమ నా హృదయమునందు మండుచుండును. కృపగల ఆత్మను నాపై కుమ్మరించి గంటలకొలదిగా ప్రార్థించుటకు ప్రభువు నాకు బలమును దయచేయును” అని ఆయన చెప్పెను.
దేవుని బిడ్డలారా, తలంపులను ఒకటిగా కేంద్రీకరించి కల్వరి సిలువను తేరిచూడుడి. పాపపు తలంపులను మీ నుండి తొలగించి యేసుని రక్తమును ధ్యానించుడి. దేవుని యొక్క పలురకాల నామమును గూర్చి ధ్యానించుడి. ఆయన యొక్క గుణాతిశయములను, దైవీక స్వభావములను గూర్చి ధ్యానించుడి. ఆయన చేసిన అద్భుతములన్నిటిని ధ్యానించుడి. ఆయన మాట్లాడిన శక్తిగల మాటలను, వాగ్దానములను ధ్యానించుడి.
కీర్తనకారుడు చెప్పుచున్నాడు: “ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను” (కీర్తనలు. 104:34). ధ్యానించుట ద్వారా వచ్చు సంతోషము మధురముగా ఉండును అని దావీదు వ్రాయుచున్నాడు. ప్రభువు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకొనుచున్నప్పుడు, ప్రభువు మిమ్ములను నడిపించుకుని వచ్చిన మార్గములను తలంచి చూచుచున్నప్పుడు నిశ్చయముగానే మీయొక్క అంతరంగమునందు ఆనందము కలుగును. ప్రభువు చేసిన మేళ్లను ధ్యానించగా, ధ్యానించగా, పరలోకపు అగ్ని దిగివచ్చుటను గ్రహించుదురు. మీకు తెలియకుండానే ప్రభువును స్తుతించుటకు అనిపించును. ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు ప్రభువుచే ప్రేరేపించబడుదురు.
ప్రభువును స్తుతించుటకు అన్నివేళయు తగిన వేళయే. అయినప్పటికీని, ఉదయకాల సమయమున ప్రభువునకు ప్రధమ స్థానమును ఇచ్చి ఆయనను ధ్యానించవలసిన సమయమునైయున్నది. మధ్యాహ్నపు వేళయు కూడాను పనుల మధ్యలోను ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయనను పొగడుచుండు సమయమునైయున్నది. సాయంకాల సమయము కూడాను నిమ్మలమైన ఒక ఒక స్థలమును వెతుక్కుంటూ వెళ్లి ప్రభువు యొక్క ప్రేమను తలంచి చూచుటకు బహు చక్కటి సమయమునైయున్నది. రాత్రి సమయము కూడాను ఆయనను ధ్యానించుటకు సరియైనది!
నేటి ధ్యానమునకై: “నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసికొని, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు” (కీర్తనలు. 63:4).
